కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంతో చంద్రబాబు తెగదెంపులు చేసుకున్న విషయం తెలిసిందే... ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన వెంటనే ప్రభుత్వంపై తెదేపా అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చింది... దీంతో ఒక్కసారిగా దేశమంతా రాజకీయ వేడి మొదలైంది... ఈ ప్రభావం స్టాక్మార్కెట్లపై పడింది... అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలతో ఆరంభం నుంచే కుదేలవుతూ వస్తున్న సూచీలు.. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారీ పతనం దిశగా సాగాయి. చివరి గంటల్లో కుప్పకూలిన సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి..
పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈ క్రమంలో, 137 పాయింట్ల నష్టంతో 33,548 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఇక తెదేపా అవిశ్వాస తీర్మానంపై దేశీయంగా రాజకీయ వేడి రగులుకోవడంతో సూచీలు మరింత పతనమయ్యాయి. ఒక దశలో 550 పాయింట్లకు పైగా దిగజారిన సెన్సెక్స్ 33,120 పాయింట్ల కనిష్ఠస్థాయికి పడిపోయింది. చివరకు కాస్త కోలుకున్నా భారీ నష్టాలు తప్పలేదు. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 509 పాయింట్ల కోల్పోయి 33,176 వద్ద స్థిరపడింది.
అటు నిఫ్టీ కూడా నేడు భారీగా కుదేలైంది. 50 పాయింట్ల నష్టంతో 10,300 మార్క్ వద్ద ఊగిసలాడుతూ ప్రారంభమైన నిఫ్టీ మదుపర్ల అమ్మకాల ఒత్తిడితో అంతకంతకూ పతనమైంది. ఒక సమయంలో 170 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడ్ అయిన సూచీ చివరకు 165 పాయింట్లు కోల్పోయి 10,195 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, టాటామోటార్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్, భారత్పెట్రోలియం, ఏషియన్ పెయింట్స్ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. ఒక్కో కంపెనీ షేరు విలువ 3 నుంచి 4శాతానికి పైగా పతనమైంది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ముగిశాయి.