అనంతపురం జిల్లాలో ప్రారంభించిన కియ కార్ల తయారీ పరిశ్రమ యమ స్పీడుగా రూపుదిద్దుకొంటోంది. 2019లో కార్లను ఉత్పత్తి చేసి, రోడ్డెక్కించడం లక్ష్యంగా పనులు పరుగులు తీస్తున్నాయి. శంకుస్థాపన జరుపుకొన్న ఈ రెండు నెలల్లోనే 30 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇదే ఊపు కొనసాగితే, వచ్చే ఏడాది మార్చి నాటికి పరిశ్రమ సిద్ధం అవుతుంది. రూ.13,500 కోట్లు పెట్టుబడితో ఇక్కడ భారీ కార్ల పరిశ్రమకు ‘కియ’ శ్రీకారం చుట్టింది. దీనికిగాను అవసరమైన యంత్ర సామగ్రిని కొరియా నుంచి దిగుమతి చేసుకొంటోంది. ఆ సామగ్రిని తొలుత కృష్ణపట్నం రేవుకు తీసుకొచ్చి, అక్కడినుంచి రోడ్డు మార్గంలో పరిశ్రమ వద్దకు తరలిస్తున్నారు. ప్రస్తుతం బాడీ బిల్డ్‌షాపు యూనిట్, ప్రెస్ యూనిట్, అసెంబ్లింగ్ యూనిట్, పెయింటింగ్ షాపు ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి.
ఉద్యోగుల కోసం దుద్దేబండ క్రాస్ వద్ద చేపట్టిన టౌన్‌షిప్ నిర్మాణ పనులు 30 శాతం పూర్తయ్యాయి. 12.6 ఎకరాల్లో 16 భవనాల్లో 82 గదుల నిర్మాణం చేపట్టారు. 2018 ఆగస్టు నాటికి ఈ భవనాలు అందుబాటులోకి రానున్నాయి. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి పరిశ్రమకు నీటిని అందించడానికి చేపట్టిన రూ.22 కోట్ల విలువైన పైప్‌లైన్ నిర్మాణ పనులు 70 శాతం పూర్తయ్యాయి. ప్రస్తుతం రూ.3.5 కోట్లతో ఇంటెక్‌వెల్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఉద్యోగ నియామకాల అనంతరం శిక్షణ ఇవ్వడానికి దుద్దేబండ క్రాస్‌లో 11 ఎకరాల్లో నిర్మిస్తున్న శిక్షణ కేంద్రం పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ కేంద్రంలో ఒకేసారి వంద మందికి శిక్షణ ఇచ్చే వీలుంది.
అయితే, ఇక్కడ పని చెయ్యాలి అంటే, కొరియా భాష నేర్చుకుంటే, ప్రయారిటీలో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు... అందుకే, కొరియా భాష నేర్పేందుకు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దరఖాస్తులను ఆహ్వానించింది. ఎస్కేయూ స్కిల్ డెవలప్ మెంట్ ఆధ్వర్యంలో 3 నెలలపాటు ఈ భాషా శిక్షణ సాగనుంది. ‘కియ’ వంటి సంస్థల్లో ఉద్యోగాలు పొందాలంటే కొరియా భాష వచ్చి ఉంటే మంచిదనే అభిప్రాయంతో ఈ కోర్సును ప్రారంభిస్తున్నట్టు మండలి తెలిపింది. ఆసక్తి కలిగిన వారు www.skuniversity.ac.in, www.skillsku.com నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకుని, ఈనెల 12 లోగా పూర్తిచేసి సమర్పించాలని కోరింది. ఇక్కడ నుంచి, పూర్తి వివరాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు http://skuniversity.ac.in/dload/SKU%20-%20Certificate%20Course%20in%20Korean%20Language%20-%20Notification.pdf