కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య, ఇంత గోల జరుగుతున్నా, కేంద్రం, మన రాష్ట్రానికి ప్రశంసలు పంపించింది... జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2017-18 లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో సుపరిపాలనా సూచికలైన 7 రిజిష్టర్ల నిర్వహణ, పనుల వారీ ఫైల్స్ నిర్వహణ, పౌరసమాచార బోర్డుల ఏర్పాటు, 42 లక్షల జాబ్ కార్డులు జారీ చేయడంలో ఉత్తమ పనితీరు కనబర్చినందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ సెక్రటరి అపరాజిత సారంగి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ప్రసంశించారు.
అదే విధంగా కేంద్ర ప్రభుత్వం వేతన నిధుల విడుదల్లో జాప్యం చేసినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి, పేదల సమస్యలను దృష్టిలో , వుంచుకుని నిధులు విడుదల చేసిందని ఆమె ప్రసంశించారు. ఆర్ధిక సంవత్సరం ముగిసిన నేపథ్యంలో వివిధ రాష్ట్రాలకు పంపిన అభినందన సందేశం ద్వారా ఈ అంశాలను వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం పేదల వేతలను దృష్టిలో వుంచుకుని వేతన చెల్లింపులో జాప్యాలను నివారించడానికి గానూ వేతన చెల్లింపుల నిమిత్తం రూ. 180 కోట్ల నిధులను విడుదల చేసింది.
2017-18లో 21.53 కోట్ల పనిదినాలను వేతనదారులకు కల్పించి మొత్తం రూ. 6149.38 కోట్లు పథకం కింద ఖర్చు చేసింది. ఇందులో రూ. 3,159.87 కోట్లను వేతనాల రూపంలో, రూ. 2645.67 కోట్లు మెటిరీయల్ వాటా కింద ఖర్చు చేసింది. అలాగే 2017-18 లో 6,33,080 కుటుంబాలకు 100 రోజుల పని కల్పించింది. పథకం ప్రారంభం నుంచి ఒక ఆర్ధిక సంవత్సరంలో ఇంత పెద్ద మొత్తంలో నిధులు వ్యయం చేయడం ఇదే ప్రధమం. ఆంధ్రప్రదేశ్ 2017-18 ఆర్థిక సంవత్సరంలో దేశ స్థాయిలో నాలుగు సూచికల్లో ప్రధమ స్థానంలో, నాలుగు సూచికల్లో ద్వితీయ స్థానంలో సముచిత స్థాయిలో నిల్చింది.