ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చెయ్యండి అని మనం పోరాడుతుంటే, రాష్ట్రంలో మూడు పార్టీలు కలిసి తన పై ముప్పేట దాడి చేస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేతలతో గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంలో చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు... నా పై, మంత్రుల పై, ఎదో ఒక విధంగా కక్ష సాధిస్తారనే సమాచారం ఉందని, కక్ష సాధింపు చర్యలు తీవ్ర స్థాయిలో ఉంటాయని, అన్నింటికీ అందరూ సిధ్ధంగా ఉండాలని, ప్రజలకు వీళ్ళ కుట్రల పై చైతన్యపరచాలని నేతలను ఆదేశించారు...
బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీలు తీవ్ర కుట్రలు చేస్తున్నాయని , తన ఇమేజ్ ని దెబ్బతీయడమే వారి ప్రధాన అజెండా అని, ఈ మూడు పార్టీలూ కలసి మహాకుట్ర పన్నాయని ఆరోపించారు. భారతదేశ చరిత్రలో ఒక్క తెలుగుదేశం మాత్రమే ప్రాంతీయ పార్టీగా ఉండి జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించిందని, ఇదే బీజేపీకి కంటగింపు అయిందని, అందువల్లే తనను బలహీనపరచాలని బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవర్తన గత కొంతకాలంగా భిన్నంగా ఉందని, ఏపీని ఇబ్బంది పెట్టాలని చూస్తోందని చంద్రబాబు అన్నారు.
గతంలో ప్రత్యేక ఆర్థిక సాయానికి ఎందుకు ఒప్పుకున్నది... ఇప్పుడెందుకు హోదాయే కావాలంటున్నామన్నదానిపై ప్రజలకు వివరించాలని చంద్రబాబు నేతలకు సూచించారు. ఏ రాష్ట్రాలకు హోదా ఇవ్వడం లేదని అంటేనే అప్పుడు ప్రత్యేక ఆర్థికసహాయానికి ఒప్పుకున్నామని సీఎం పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన మాట తప్పిందని, హోదా ఉన్న రాష్ట్రాలకు 90:10 కింద... నిధులు,ప్రోత్సాహకాలు కొనసాగిస్తోందన్నారు. వేరే రాష్ట్రాలకు ఇచ్చేటట్లయితే ఏపీకి కూడా అదే పేరుతో ఇవ్వాలని కోరామని, దీనిపై ప్రజలను చైతన్యపరచాలని, తమ వాదనలో హేతుబద్ధత గురించి వివరించాలని ముఖ్యమంత్రి సూచించారు.