అరకు ఎమ్మెల్యే . మాజీ ఎమ్మెల్యేలను మావోయిస్టులు కాల్చి చంపటం అనేది తీవ్రంగా ఖంచించాల్సిన విషయం... ప్రజాస్వామ్యంలో హింస కు తావులేదు, సమర్ధనీయం కాదు.. ఈ సంఘటన జరిగిన తర్వాత, కొన్ని రాజకీయ పార్టీలు సామాజిక మాధ్యమాల ముసుగులో, పోలీసులు / ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నాయి అంటూ పోస్టులు పెట్టి, ఇది చంద్రబాబు వైఫల్యం అంటూ రాస్తున్నారు... అయితే ఈ పోలీస్ నోటీసులు చూస్తుంటే ఆ ఇద్దరిని ముందే పోలీస్ డిపార్ట్మెంట్ టార్గెట్ లిస్టులో ఉన్నారని, పోలీసులకు చెప్పకుండా ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లవద్దని, వీలైనంతవరకూ సురక్షితప్రాంతాలలో ఉండాలని ముందే హెచ్చరించినట్లు క్లియర్ గా తెలుస్తుంది... అయినా ఆ హెచ్చరికలను పట్టించుకోకుండా ప్రాణాలు కోల్పోవటం అనేది దురదృష్టకరం..
అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావును జాగ్రత్తగా ఉండాలంటూ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాల సందర్భంగా వారి టార్గెట్‌లో ఉన్న మీరు బయటకు వెళ్లొద్దంటూ అరకులోయ ఎస్ఐ.. ఎమ్మెల్యేకు అందజేసిన హెచ్చరిక నోట్‌ను పోలీసుశాఖ విడుదల చేసింది. సురక్షితమైన ప్రాంతంలో ఉండాలని లేఖలో కోరారు. ఈ నెల 21న సర్వేశ్వరరావు సంతకం చేసి ఆ లేఖను తీసుకున్నట్లు అందులో ఉంది. అయితే 23 వరకూ అప్రమత్తంగా ఉండాలని అందులో లేదు. 15 రోజుల క్రితమే ప్రజాప్రతినిధులకు నోటీసులు అందజేశామని.. మైదాన ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించామని సీఐ వెంకునాయుడు వ్యాఖ్యానించారు.
మరో పక్క, అరకులోయ, డుంబ్రిగుడ మండలాల ప్రజలు సంయమనం పాటించాలని విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ విజ్ఞప్తిచేశారు. ప్రజలు ఎటువంటి విధ్వంసాలకు పాల్పడవద్దని కోరారు. సర్వేశ్వరరావు, సివేరి సోమ హత్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీయకుండా ప్రజలు సహకరించాలని, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యలపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని తెలిపారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో మావోయిస్టులపై తీవ్రమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.