అమరావతి పరిధిలోని రాయపూడి సమీపంలో అఖిల భారత సర్వీసు అధికారుల కోసం నిర్మిస్తున్న నివాస భవనాల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దీనిలోభాగంగా తొలివిడతలో ఓ పన్నెండు అంతస్తుల భవనాన్ని 85 రోజుల్లోనే పూర్తిచేశారు. మలేసియాలో ప్రాచుర్యం పొందిన ‘షీర్‌వాల్’ సాంకేతిక పరిజ్ఞానాన్ని దీని నిర్మాణంలో వినియోగించారు. సిమెంట్, కంకర మిశ్రమాన్ని ఉపయోగించి.. శ్లాబ్‌తో పాటు సంబంధిత గోడలను కూడా ఒకేసారి పూర్తిచేయడం ఈ సాంకేతిక పరిజ్ఞానం ప్రత్యేకత. ఒక్కో అంతస్తులో నాలుగు పడకగదులతో కూడిన రెండు ఫ్లాట్లు చొప్పున.. 12 అంతస్తుల్లో కలిపి మొత్తం 24 ఫ్లాట్లు నిర్మించారు.
పూర్తిగా సిద్ధమైన ఈ భవనంలో.. అలంకరణ తదితర పనులనూ సాధ్యమైనంత త్వరలోనే పూర్తిచేసి ప్రభుత్వానికి అందజేయాలని గుత్తేదారు సంస్థ భావిస్తోంది. మరో పక్క, రాజధానిలోని నేలపాడు వద్ద నిర్మాణంలో ఉన్న జ్యుడీషియల్ కాంప్లెక్స్‌ను రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పరిశీలించారు. సీఆర్డీయే కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ ఈ కాంప్లెక్స్ వివరాలను, పనుల ప్రణాళికను ఆయనకు వివరించారు. ఇందులోని 6 భాగాలకుగాను ఒక భాగానికి సంబంధించిన మొదటి శ్లాబ్ పూర్తయిందని, మరో భాగపు శ్లాబ్ పనులకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.
మిగిలిన 4 భాగాలకు సంబంధించిన కాలమ్స్ పనులు చురుగ్గా సాగుతున్నాయని, ఈ ఏడాది డిసెంబర్ 15వ తేదీకల్లా అన్ని పనులు పూర్తి చేసి, హైకోర్టు నిర్వహణకు వీలుగా ఈ కాంప్లెక్స్‌ను సిద్ధం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం శ్రీనివాస్ రాయపూడి వద్ద నిర్మాణంలో ఉన్న ఏఐఎస్ అధికారుల నివాసాలను కూడా చూశారు. అక్కడి నమూనా ఫ్లాట్‌ను సందర్శించారు. ఈ పర్యటనలో సీఆర్డీయే సీఈ ఎం.జక్రయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.