అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు , మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను నక్సల్స్ దారుణంగా హత్య చేసిన ఘటన ఏపీలో సంచలనం సృష్టిస్తోంది. చేతులు వెనక్కి కట్టి.. పాయింట్ బ్లాంక్‌లో దారుణంగా కాల్చి చంపేశారు. హత్యకు ముందు ఏం జరిగిందో ప్రత్యక్ష సాక్షి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ డ్రైవర్ చిట్టిబాబు మీడియాకు వివరాలు వెల్లడించాడు. రెండు వాహనాల్లో ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ, ఇద్దరు డ్రైవర్లు, మరో ఆరుగురు కలిసి వెళ్తుండగా, ఆడవాళ్ళు అడ్డుగా వచ్చారని, అయితే వాళ్ళు ఏదన్నా సమస్య చెప్పుకోవటానికి ఆపుతున్నారు అనుకుని, స్లో చెయ్యగానే, వెంటనే నక్సల్స్ తమను చుట్టుముట్టారని తెలిపాడు.
వాహనాలు ఆపకుంటే బాంబులతో పేల్చేస్తామని హెచ్చరించారని.. అయినా ముందుకెళ్లడానికి ప్రయత్నించగా... 20మంది నక్సల్స్ తమకు అడ్డుగా వచ్చారని తెలిపాడు. ముందుకు పోవడానికి ప్రయత్నిస్తే ఎన్కౌంటర్ దారుణంగా ఉంటుందని తమను హెచ్చరించారని చిట్టిబాబు చెప్పాడు. ఏమీ చేయలేని పరిస్థితుల్లో వాహనాన్ని ఆపేశానన్నాడు. సోమ ఎవరని అడిగారని... కారు దించి సోమ చేతులు వెనక్కి కట్టేశారని చిట్టిబాబు తెలిపాడు. గన్మెన్లు, డ్రైవర్లకు గురిపెట్టి వెపన్లు స్వాధీనం చేసుకున్నారని చెప్పాడు. సర్వేశ్వరరావును కూడా చేతులు వెనక్కి కట్టి తీసుకువెళ్లారన్నాడు. తమను రౌండప్ చేయడంతో.. అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడిందన్నాడు. వాళ్లిద్దరినీ దూరంగా తీసుకువెళ్లి.. సుమారు 40 నిమిషాల తర్వాత మూడు, నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారన్నాడు చిట్టిబాబు. ఆ తర్వాత తాము పై అధికారులకు సమాచారమందించామని తెలిపాడు.
ఇది ఇలా ఉండగా, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యలో ఏవోబీ రాష్ట్ర కమిటీ మిలటరీ కమిషన్ కార్యదర్శి రాంచంద్రారెడ్డి ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి పాల్గొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలంలో ప్రతాప్ రెడ్డి కదలికలు ఉన్నట్లు పోలీసులకు నిఘా వర్గాలు సమాచారం అందించాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఘటనా స్థలంలో యాక్షన్ టీమ్‌తో పాటు మావోయిస్టుల సానుభూతిపరులు కూడా ఉన్నారని తెలుస్తోంది. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రతాప్ రెడ్డి మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఉన్నారు. సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్న ఆయనను మిలటరీ కమిషన్ కార్యదర్శిగా మావోయిస్టు పార్టీ నియమించింది. అతని ఆధ్వర్యంలోనే యాక్షన్ టీమ్ పనిచేస్తోంది. ఈ యాక్షన్ టీమే కిడారి, సోమల హత్యలకు కారణమని తెలుస్తోంది.