తెలంగాణలో మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్‌తో కలసి పోటీ చేసినా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సహా ఏ పార్టీతోనూ తెదేపాకు పొత్తు ఉండబోదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. చంద్రబాబు అధ్యక్షతన శనివారం ఉండవల్లిలోని ప్రజావేదికలో జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తెదేపా లక్ష్యమని, ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలనుంచే ఆ దిశగా పనిచేయాలని నిర్ణయించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయానికే మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, మాయావతి వంటివారిని ఒక తాటిపైకి తెచ్చి డీఎంకే వంటి పార్టీలతోనూ కలిపి ప్రత్యామ్నాయ వేదికను సిద్ధం చేయాలని నిర్ణయించారు.
అవసరమైతే చంద్రబాబు ఆయా నాయకులతో కలిసి ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో భాజపాకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఒక పక్క విభజన చట్టంలోని హామీలు, రాష్ట్రానికి రావలసిన ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచుతూనే, మరోవైపు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా జాతీయ స్థాయిలో పోరాడాలన్న నిర్ణయానికి వచ్చారు. మనమేదో కాంగ్రెస్‌తో చేతులు కలుపుతున్నామన్న భావన ప్రజల్లో కలిగించడం మంచిది కాదని, తెలంగాణలో మహాకూటమిలో కాంగ్రెస్ కూడా భాగస్వామే తప్ప నేరుగా ఆ పార్టీతో చేతులు కలపలేదని, ఈ విషయంలో ఎంపీలంతా స్పష్టతతో ఉండాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఏపీ అభివృద్ధిని చూసి గుజరాత్ కన్నా ఎక్కడ ముందుకు వెళ్తుందో అన్న ఆందోళన ప్రధాని మోడీలో ఉందని అందుకే చంద్రబాబు, వెంకయ్యనాయుడులు ఉన్నారని గుజరాత్‌కు ఎవరున్నారన్న మోడీ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో బీజేపీ, వైకాపా రహస్య పొత్తులపై మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయని, గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణకు లబ్ధి చేకూర్చేందుకే లేళ్ల అప్పిరెడ్డిని పక్కకు పెట్టారని ప్రజలు, ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారని కొందరు ఎంపీలు ఈ సందర్భంగా చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన చంద్రబాబు రాష్ట్రంలో 10, 15 సీట్లు బీజేపీకి ఇచ్చేందుకు సైతం జగన్ ఉన్నట్లుగా తెలుస్తుందన్నారు. ఈ అనైతిక పొత్తులు, రహస్య లాలూచీలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి ఎండగట్టాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు.