పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం చేస్తారో ఆయనకే తెలియదు. ఎప్పుడు ప్రజల మధ్య ఉంటారో, ఎప్పుడు బయటకు వస్తారో, ఎప్పుడు ఎటు వెళ్తారో, ఎప్పుడు ఎవరికి సపోర్ట్ ఇస్తారో, రాత్రికి రాత్రి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళ పై ఎలా రివర్స్ అవుతారో, అన్నీ సస్పన్స్.. తన మీద నిఘా ఉందని, తన ఇంటి పై డ్రోన్ లు తిప్పుతున్నారని చెప్పిన పవన్, బహుసా అందుకే, తాను ఎప్పుడు ఏమి చేసేది కనీసం, తన పార్టీ వాళ్లకి కూడా చెప్పకుండా, తన రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. ఆగష్టు 14న ఏపి నుంచి తెలంగాణా వెళ్ళిపోయి, దాదాపు 40 రోజుల తరువాత బయటకు వచ్చారు. వచ్చీ రావటంతోనే, ఒక వారం రోజులు, అద్భుతమైన జ్ఞాన గుళికలు వదిలారు.
చింతమనేని పై విమర్శలు, నా పై ముగ్గురు హత్యాయత్నం చేస్తున్నారని, తన ఇంటి పై డ్రోన్ తిప్పుతున్నారని ఇలా అనేక అర్ధం కాని ఆరోపణలు చేసిన పవన్, ఉన్నట్టు ఉండి యాత్ర ఆపేసి హైదరాబాద్ వెళ్ళిపోయారు. దీని గురించి కనీసం పార్టీ వైపు నుంచి ఒక స్టేట్మెంట్ కూడా లేదు. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో, పవన్ ఇక జనాల్లోనే ఉంటారని అనుకున్న టైంలో, మరోసారి తన నిలకడ లేని తనం చూపించారు పవన్. వారం రోజులు తిరిగి, ఇక నా వల్ల కాదు అని, హైదరాబాద్ వెళ్ళిపోయారు. కనీసం, తన క్యాడర్ కి ఈ విషయం కూడా తెలియదు. ఎందుకు వెళ్ళిపోతాడో, ఎందుకు వస్తాడో, ఏమి మాట్లాడతాడో ఎవరికీ అర్ధం కాదు.
అయితే ఈ విషయం పై అభిమానల్లో గందరగోళం ఉండటంతో, పవన్ మళ్ళీ 6 వ తేది తిరిగి వస్తారని, 9న పశ్చిమగోదావరి జిల్లాలో పోరాట యాత్ర ముగించుకుని కొవ్వూరు నుండి గోదావరి బ్రిడ్జి మీదుగా రాజమండ్రికి కవాతు నిర్వహిస్తారని చెప్పారు. మరో పక్క, పవన్ చేస్తున్న అర్ధం లేని ఆరోపణల పై తెలుగుదేశం మండి పడుతుంది. పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమని, చిరంజీవికి పాలకొల్లులో ఎదురైన పరాభవమే ఎదురవుతుందని తెలుగుదేశం ఎంపీ కేసినేని నాని తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, పవన్ కల్యాణ్ సినిమా యాక్టర్ కాబట్టే ఆయన్ను చూడటానికి జనం వస్తున్నారని, వారిలో ఓట్లు వేసేవారుండరని వ్యాఖ్యానించారు. పవన్ వాపును చూసి బలుపని అనుకుంటున్నారని, ఆయన ఘోరమైన ఓటమికి అతి దగ్గరలో ఉన్నారని అన్నారు. బీజేపీ నుంచి అందిన ఆదేశాల మేరకు చంద్రబాబును విమర్శిస్తున్న ఆయనకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.