తెలంగాణలో ముందస్తు ఎన్నికల జ్వరం రాజకీయపార్టీలను అతలాకుతలం చేస్తోంది... ఇప్పటికే అసెంబ్లీని రద్దు చెయ్యటం, ఎన్నికల తేదీల పై హడావిడి, ఐటి రైడ్లు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మూడు రాష్ట్రాల ఎన్నికలతో పాటు తెలంగాణకు కూడా ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమీషన్ నిర్ణయం తీసుకుంటే, మరో నెలలో తెలంగాణాలో ఎన్నికలు వస్తాయి. కాగా, తెలంగాణ ముందస్తు ఎన్నికల ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోంది. తెలంగాణలో టిఆర్‌ఎస్, కాంగ్రెస్ ముఖాముఖిన తలపడబోతున్నారని ప్రచారం జరుగుతున్నా, టిడిపికి ఈ ఎన్నికల్లో ప్రముఖ పాత్ర పోషించబోతోంది. తెలంగాణ వ్యతిరేక పార్టీగా ముద్రపడిన టిడిపి తెలంగాణ సెంటిమెంట్ దండిగా ఉన్న 2014 ఎన్నికల్లోనే బిజెపితో కలసి 20సీట్లను గెలుచుకోగలిగింది.
అయితే తరువాత రోజుల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా, ఇంకా ఆ పార్టీ బలమేమీ తగ్గలేదు. ఇప్పుడు అన్ని సీట్లను గెలుచుకోలేకపోయినా,టిఆర్‌ఎస్‌ల గెలుపు, ఓటముల పై ప్రభావం చూపగలదు. దీంతో, టిడిపిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై కెసిఆర్ కసరత్తులు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా, తెలంగాణలో మళ్లీ టిఆర్‌ఎస్ కనుక గెలిస్తే, రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కెసిఆర్ కీలకమైన పాత్ర పోషిస్తారని, ఆ పార్టీకి చెందిన నాయకులు, వైకాపాకు చెందిన నాయకులు చెబుతున్నారు. డిసెంబర్ లోపు..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం మళ్లీ కొలువు తీరితే కెసిఆర్ ఆంధ్రా పై దృష్టిసారిస్తారని, ఆంధ్రాలో ఆయన ప్రచారం చేసినా చేయవచ్చునని చెబుతున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే జగన్ నయమని ఆయన చెప్పబోతున్నారని కెసిఆర్ కనుక మళ్లీ తెలంగాణలో గెలిస్తే, ఇక్కడ చంద్రబాబుకు ఇక్కట్లు తప్పవని, టిఆర్‌ఎస్‌కు చెందిన నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ముందస్తు ఎన్నికల్లో కెసిఆర్ కనుక ఘనవిజయం సాధిస్తే, ఆ ప్రభావం ఆంధ్రా రాజకీయాల పై ఖచ్చితంగా ఉంటుందని వారు చెబుతున్నారు. బిజెపితో అంటకాగుతున్న కెసిఆర్ తమకు కామన్ శత్రువు అయిన చంద్రబాబును ఓడించడానికి, ఆంధ్రాలో పర్యటిస్తారని, అదే సమయంలో జగన్ కు మద్దతు ఇవ్వాలని ఆయన కోరతారని ప్రచారం జరుగుతోంది. అందుకే జగన్ కూడా రంగంలోకి దిగారు. అవసరం అయిన చోట ఫైనాన్సు చెయ్యటానికి కూడా సిద్ధమయ్యారు. మిషన్ భాగీరధ కాంట్రాక్టు తీసుకున్న తన నాయకులని, కెసిఆర్ కు తగు సహాయం చెయ్యమని ఆదేశించారు. ఈ బాధ్యత అంతా విజయసాయి రెడ్డికి అప్పగించినట్టు తెలుస్తుంది. కెసిఆర్ గెలుపు కోసం, తన సామాజిక వర్గ పెద్దలని సపోర్ట్ చెయ్యమని అడుగుతున్నారు. అయితే ఇప్పటికే రెడ్లు అందరూ , కెసిఆర్ కి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. జగన్ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి...