అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హత్య చేసిన మావోయిస్టులు మరికొందరిపై దాడుల కోసం వేచి చూస్తున్నట్టుగా తెలుస్తోంది. అరకు, డుంబ్రిగుడ పరిసర ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్ జరుగుతున్నా లెక్క చేయకుండా ముగ్గురు మావోయిస్టులు గురువారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో అరకులోయకు నాలుగు కిలోమీటర్ల దూరానున్న బెంజిపూర్‌కు వెళ్లారు. అక్కడ రోడ్డు పక్కనున్న బస్‌షెల్టర్ వద్ద ఒక యువకుడు నిల్చొని వుండగా, ముగ్గురు వెళ్లి...అరకు ఎంపీపీ, టీడీపీ నాయకుడు అప్పాలు ఇల్లు ఎక్కడో తెలుసా? అంటూ ప్రశ్నించారు. వారి చేతిలో వాటర్ బాటిల్, వీపునకు బ్యాగులు, చేతిలో ఆయుధాలు వంటివి వుండడంతో భయపడిన ఆ యువకుడు తనకు ఇక్కడ ఎవరూ తెలియదని చెప్పి అక్కడి నుంచి జారుకున్నాడు.
వెంటనే ఊళ్లోకి వెళ్లి ఎంపీపీ అరుణకుమారికి, ఆమె భర్త అప్పాలుకు విషయం తెలియజేశాడు. చెమటలు కక్కుతూ ఆందోళనగా వచ్చిన ఆ యువకుడిని చూసి ఏమైందని వారు ప్రశ్నించగా, మీ కోసం మావోయిస్టులు వచ్చారని, తప్పించుకొని పారిపోవాలని సూచించాడు. వచ్చిన ముగ్గురిలో ఇద్దరు మహిళలు వున్నారని వివరించాడు. దీంతో భయపడిన ఎంపీపీ అరుణకుమారి వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. దీనికి స్పందించిన అరకు సీఐ వెంకునాయుడు, ఏఎస్పీ రస్తోగి హుటాహుటిన బెంజిపూర్‌లోని ఎంపీపీ ఇంటికి వెళ్లారు. జరిగిందేమిటో తెలుసుకొని, ఆమె భర్త అప్పాలును, విషయం అందజేసిన యువకుడిని అరకు తీసుకువెళ్లారు. మరో పక్క, విశాఖ మన్యంలో గ్రామదర్శిని కార్యక్రమాల నిర్వహణపై పోలీసులు దృష్టి సారించారు. మావోయిస్టుల హిట్‌లిస్టులో ఉన్న వారి పేర్లను విడుదల చేసి వారి భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఎమ్మెల్యే ఈశ్వరికి భద్రతను పెంచారు. ముందస్తు అనుమతి లేకుండా గ్రామాల్లో పర్యటనకు వెళ్లవద్దని స్పష్టం చేశారు. పోలీసుల ఆంక్షలు మన్యంలో గ్రామదర్శిని కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రజాప్రతినిధులను గ్రామాల పర్యటనకు వెళ్లవద్దని పోలీసులు స్పష్టం చేస్తుండటంతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గ్రామదర్శిని కార్యక్రమాలు జరగని పరిస్థితులు నెలకొన్నాయి. ముంచంగిపుట్టు మండలం వనుగుమ్మలో నిర్వహించాల్సిన గ్రామదర్శిని కార్యక్రమానికి పోలీసులు అనుమతులు ఇవ్వకపోవడంతో రద్దు చేయాల్సి వచ్చింది. పెదబయలు మండలం రూడకోటలో గురువారం జరగాల్సిన గ్రామదర్శిని కార్యక్రమానికి పోలీసులు అనుమతులు నిరాకరించారు. పాడేరు మండలం గొండెలిలో గ్రామదర్శిని కార్యక్రమానికి ఎమ్మెల్యే ఈశ్వరి వెళ్లాల్సి ఉంది.