జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రాణాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి భరోసా ఇచ్చారు. సమాచారం ఇస్తే రక్షణ కల్పించే బాధ్యత తీసుకుంటామన్నారు. తాడేపల్లిగూడెం ధర్మపోరాట సభలో మాట్లాడిన ఆయన.. ప్రాణహాని ఉందంటూ గురువారం ఏలూరు సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఫిర్యాదు చేస్తే.. కావలసినంత భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. సమాచారం ఇవ్వకుండా విమర్శిస్తే, విమర్శగానే ఉండిపోతుందని, దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. అనవసరంగా భయపడొద్దని సూచించారు. ఏపీలో స్వచ్ఛమైన, నీతివంతమైన పాలన టీడీపీ అందిస్తోందని చంద్రబాబు అన్నారు.
ఏపీకి కేంద్రం తీవ్రమైన అన్యాయం చేసిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ‘‘ధోలేరా నగరానికి మోదీ రూ. 3వేల కోట్లు ఇచ్చారు. బుల్లెట్ ట్రైన్‌కు రూ. 1.10 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ముంబై మెట్రోకు రూ. 52వేల కోట్లు ఇచ్చారు. మన రాజధానికి రూ. 1500 కోట్లే ఇచ్చి ద్రోహం చేశారు. రూ. 1500 కోట్లతో ఎలక్ట్రిసిటీ కేబుల్ కూడా రాదు. ప్రపంచ అత్యుత్తమ నగరాల్లో అమరావతి నిలుస్తుంది. వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చి వెనక్కి తీసుకున్నారు. అకౌంట్‌లో వేసిన డబ్బులు వెనక్కి తీసుకోవడం చట్ట వ్యతిరేకం. విద్యాసంస్థలకు అరకొర నిధులు ఇచ్చారు. దుగరాజపట్నం పోర్టు విషయంలోనూ కేంద్రం మోసం చేసింది. రామాయపట్నం పోర్టు నిర్మించకుంటామంటే అడ్డుకుంటున్నారు. విశాఖ-చెన్నై కారిడార్‌కు నిధులు ఇవ్వడం లేదు’’ అని చంద్రబాబు దుయ్యబట్టారు.
ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీని బీజేపీ విస్మరించిందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ఎవరు అడ్డొచ్చినా పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ పనులు 58 శాతం పూర్తయ్యాయని, గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేశామన్నారు. పోలవరం పూర్తయితే పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు పంటలకు సాగునీరు అందుతుందన్నారు. వచ్చే మే నాటికి గ్రావిటీ ద్వారా నీరు ఇస్తామని చంద్రబాబు చెప్పారు.