ఆంధ్రప్రదేశ్ కు మరో భారీ ప్రాజెక్ట్ రాబోతోంది. ఎలక్ట్రిక్ వాహనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు సౌర బ్యాటరీలు చెందిన ప్రాజెక్ట్ వైపు దృష్టి సారించింది. సౌర విద్యుత్ పరికరాల తయారీ లో పేరుగన్న ట్రైటన్ సోలార్ ఆంధ్రప్రదేశ్ లో సోలార్ బ్యాటరీ తయారీ ప్రాజెక్టు ను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు అమెరికా పర్యటన లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అధికారుల బృందంతో ట్రైటన్ సోలార్ సంస్థ చర్చలు జరిపింది. ప్రాజెక్టు ఏర్పాటు కు ఆ సంస్థ చైర్మన్ హిమాంశు పటేల్, మేనేజింగ్ పార్టనర్ నంద శాండిల్య - పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అజేయ్ జైన్, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈఓ జాస్తి కృష్ణ కిషోర్ మధ్య ముఖ్యమంత్రి సమక్షంలో అవగాహనా ఒప్పందం కుదిరింది.
ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు వంద మిలియన్ల యూఎస్ డాలర్లు అంటే సుమారు 727 కోట్ల 84 లక్షల రూపాయలు అంచనాతో పెట్టుబడిని దశలవారీగా పెడతామని ట్రైటన్ సోలార్ సంస్థ పేర్కొంది. ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఈ ప్లాంట్ ఏర్పాటుకు 100-200 ఎకరాల భూమి అవసరం అవుతుందని ఆ సంస్థ ప్రతిపాదించింది. ఈ సౌర బ్యాటరీని తయారు చేయడానికి నానోటెక్నాలజీ - లిథియం పాలిమర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వాహనాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందని, దీనిలో భాగంగా సౌర బ్యాటరీలు ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటాయని ముఖ్యమంత్రి అన్నారు. దీనివల్ల కాలుష్యం తగ్గడమే కాకుండా, ప్రజలకు లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామమని, నవ్యంధ్ర నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
మూడో రోజు చంద్రబాబు షడ్యుల్.. భారత కాలమాన ప్రకారం ఈ సాయంత్రం 6.30కు WEF ప్రతినిధి టషీనా లెబికోస్కీకి ఇచ్చే వీడియో ఇంటర్వ్యూతో మూడోరోజు అమెరికాలో ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమాలు ప్రారంభం... రాత్రి 8 గంటలకు (IST) ‘సుస్థిర అభివృద్ధి-ప్రభావ సదస్సు’కు హాజరు... ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి-ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వహించే బహు పాక్షిక సదస్సులో ‘శీఘ్ర సుస్థిర ఉత్పాదకత సాధన’ అనే అంశంపై సంయుక్త పత్రం విడుదల... రాత్రి 9.45 (IST) వైర్లెస్ ఆప్టికల్స్ కమ్యూనికేషన్స్ రంగ దిగ్గజం-గూగుల్ ‘ఎక్స్’ సంస్థ ఉపాధ్యక్షుడు టామ్ మూరే, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఓవర్సైట్ కౌన్సిల్-ఎఫ్ సాక్ (FSOC) ప్రాజెక్టు హెడ్ మహేశ్ కృష్ణస్వామితో లంచ్ సమావేశం... రాత్రి 11.30 (IST)కు ఆర్టిఫీషియల్ టెక్నాలజీ రంగానికి చెందిన ఇన్వెస్టర్లతో రౌండ్ టేబుల్ సమావేశం, అత్యాధునిక ఐవోటీ సాధనాల ఆవిష్కారాల ఆవశ్యకతలపై సమావేశంలో తన అభిప్రాయాలను వెల్లడించనున్న ముఖ్యమంత్రి... అర్థరాత్రి 12.30 (IST)కు ఆర్డోర్ ఈక్విటీ పార్టనర్లతో సమావేశం... 2.20 AM (IST)కు వరల్డ్ ట్రేడ్ సెంటర్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. 4AM (IST)కు యుఎస్-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక (USISPF)కు చెందిన 25మంది ఉన్నత శ్రేణి ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం