రాజకీయ కక్షతోనే కేంద్రం ప్రభుత్వం తనపై ఐటీదాడులకు దిగిందని… టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ఆరోపించారు. సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. భయాందోళనలకు గురి చేయాలనే లక్ష్యంతో కేంద్రం ఇదంతా చేస్తోందన్నారు.. పరోక్షంగా బీజేపీలో చేరాలంటూ బెదిరింపులకు దిగుతోందన్నారు. ఐటీ దాడులు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పీఏసీ మెంబర్గా గెలిచినందుకే తనపై ఐటీ దాడులు చేయించారన్నారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా వెళ్తే ఇలాగే దాడులు జరుగుతాయని, మీ పెద్దలకు చెప్పండని ఐటీ అధికారులన్నారని రమేష్ తెలిపారు. పార్టీ మారాలని ఐటీ అధికారి మదన్ అనడం దేనికి నిదర్శనమని రమేష్ ప్రశ్నించారు.
ఐటీ అధికారి మదన్ మాట్లాడిన మాటలు ఆడియో కూడా రికార్డు చేసామని చూపించారు. ఇది ఎవరికి ఇవ్వాలో వాళ్లకి ఇస్తామని, రేపు నేషనల్ మీడియాతో ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుందని, అక్కడ మరిన్ని విషయాలు చెప్తానని అన్నారు.
బంధుమిత్రులతో సహా, తన వ్యాపారాలతో సంబంధం లేని వ్యక్తులనూ వదలకుండా సోదాలు చేశారన్నారు. సోదాలు చేయడానికి గల సరైన కారణాలను ఐటీ అధికారులు చెప్పలేకపోయారని చెప్పారు. టీడీపీలో క్రియా శీలకంగా ఉండడంతో పాటు, ప్రజలతో మమేకమై ఉండడం వల్లే బీజేపీ తనపై కక్ష సాధిస్తోందని ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడబోనని స్పష్టం చేశారు.
తాను అక్రమాస్తులు కలిగి ఉన్నట్టు నిరూపిస్తే ఉరిశిక్షకైనా సిద్ధమని ప్రకటించారు. తనకు రాష్ట్రంలో రెండువేల కోట్ల విలువైన ప్రాజెక్టులు టెండర్ల ద్వారా కాకుండా నామినేటెడ్ దక్కాయంటూ కొన్ని మీడియా సంస్థల చేసిన ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు.లక్ష రూపాయలైనా నామినేటెడ్గా వచ్చినట్టు నిరూపిస్తే.. ఏ శిక్షకైనా సిద్ధమని సవాల్ విసిరారు. ఇలా దాడులతో బీజేపీ పార్టీలోకి చేర్చుకోవాలన్నదే కేంద్రం లక్ష్యం అని సంచలన ఆరోపణలు చేశారు. ఎలాంటి బెదిరింపులకు దిగినా తాను భయపడేది లేదన్నారు. ఈ దాడులతో తమకేమి నష్టం లేదని కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేరని సీఎం రమేష్ ఆరోపించారు.