రేవంత్ రెడ్డి ఇంటి పై 43 గంటలు ఐటి దాడులు చేసారు. చివరకు కొండను తవ్వి ఎలక తోక కూడా పట్టుకోలేక పోయారు. తరువాత విజయవాడ వచ్చి, టిడిపికి సానుభూతి పరులుగా ఉన్న పారిశ్రామిక వేత్తల పై దాడులు చేసారు, ఇక్కడ అసలు కొండను కూడా తవ్వలేదు, ఏమి లేక ఊపుకుంటూ వెళ్లారు. సుజనా చౌదరి కంపనీల పై చేసారు, అక్కడా ఊపుకుంటూ వెళ్లారు. ఇక లాభం లేదు, ఎదో ఒకటి పట్టుకోవాలనే ఆదేశాలు పై నుంచి రావటంతో, దాదాపు 100 మంది ఐటి అధికారులు సియం రమేష్ ఇంటి పై పడ్డారు. 51 గంటలు సోదాలు చేసారు. సాధించి సాధించి చివరకు ఇక్కడ కూడా ఎలక తోక కూడా పట్టుకోలేక పాపం, దసరా మామూలు తీసుకుని వెనుతిరిగారు.
ఆయన కంపెనీల్లో జరిపిన సోదాల్లో కొన్ని కీలక పత్రాలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్ లను అధికారులు వెంటతీసుకెళ్లారు. సీఎం రమేష్ ఇంట్లోని ఓ లాకర్, ఆయన వేలిముద్రలతోనే తెరచుకుంటుందని తెలుసుకున్న అధికారులు, ఢిల్లీలో ఉన్న ఆయన్ను పిలిపించి, దానిని తెరిపించారు. ఆపై తమ తనిఖీలు ముగిశాయని గత అర్ధరాత్రి వెల్లడించిన అధికారులు, పంచనామా పత్రాల కాపీని సీఎం రమేష్ కు అందించి వెళ్లిపోయారు. తాను బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతూ, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు, విభజన హామీల అమలు దిశగా ఒత్తిడి తెస్తున్నందునే తనపై ఐటీ అధికారులతో దాడులు చేయించారని తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యానించారు.
ఐటీ అధికారులు పంచనామా కాపీని తనకు అందించి, సోదాలు ముగిసినట్టు తెలిపి, వెళ్లిపోయిన తరువాత ఆయన గత అర్ధరాత్రి మీడియాతో మాట్లాడారు. "నేను కరుడుగట్టిన టీడీపీవాదినని అందరికీ తెలుసు. నన్ను బీజేపీలోకి రావాలని అడిగారు. సోదాలు చేసేందుకు వచ్చిన అధికారులు కూడా, బీజేపీతో ఎందుకు పెట్టుకున్నారని నన్ను ప్రశ్నించారు. నాపై నెల రోజుల క్రితం జీఎస్టీ అధికారులు దాడులు చేశారు. ఆ విషయాన్ని నేను ఎవరికీ చెప్పలేదు. భయానికి గురిచేసేందుకే నాపై బీజేపీ దాడులు చేయిస్తోంది. నేను ఎలాంటి బెదిరింపులకూ భయపడను. రేపు మరోసారి మీడియా ముందుకు వచ్చి మరిన్ని వివరాలు తెలియజేస్తాను" అని ఆయన అన్నారు.