ఆంధ్రప్రదేశ్ లో నిన్న ఒకేసారి, వివిధ రాష్ట్రాల నుంచి 150 మంది ఐటి అధికారులు రావటం, ఉదయంగా నుంచి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఈ దాడుల పై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ సీనియర్లతో మాట్లాడారు. ఎన్నికల జరగబోయే రాష్ట్రాల్లో ఐటీ, ఈడీ దాడులు చేయటం బీజేపీకి అలవాటైపోయిందని వ్యాఖ్యానించారు. ఇది మోడీ, షా నైజం అని తెలిపారు. తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, కర్నాటక, తెలంగాణాలో ఇలాగే చేసారని, మన పై ఎన్నికల ముందు వస్తారనుకుంటే, ఇప్పుడే మొదలు పెట్టారని అన్నారు. పార్టీ నేతలందరూ అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచించారు. ఎటువంటి పరిణామాలైనా ఎదుర్కొంటామని, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
అయితే ఉదయం టిడిపి నేతల ఇళ్ళ పై దాడికి బయలుదేరిన ఐటి అధికారులు, మీడియా వెంబడించడం, టీడీపీ వర్గాలకు సమాచారం అందటంతో ప్లాన్ బీని అమలు చేసినట్లు తెలుస్తోంది. మొదట బెంజిసర్కిల్లోని నారాయణ కాలేజికి వెళ్లిన ఐటీ బృందం మీడియా వెంబడించడంతో అక్కడి నుంచి బందర్ రోడ్డులోకి వెళ్లారు. అయితే తమను వెంబడించవద్దని మధ్యాహ్నం తర్వాత తామే వివరాలు వెల్లడిస్తామని ఐటీ అధికారులు స్పష్టం చేశారు.విజయవాడలో నారాయణ కళాశాలల వద్దకు వచ్చిన ఐటీ అధికారులు ఆ తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. తమ కళాశాలలపై ఎటువంటి ఐటీ దాడులు జరగలేదని మంత్రి నారాయణ ప్రకటించారు.
నెల్లూరులోని మంత్రి ఇంటి వద్దకు కూడా వెళ్లారని సమాచారం అందింది. అయితే ఆ సమయంలో మంత్రి నారాయణ ఇంట్లోనే ఉన్నారు. అక్కడకు ఎవరూ రాలేదని స్పష్టం చేశారు. టీడీపీ నేతలపై మోదీ ప్రభుత్వం కక్షసాధిస్తోందని మంత్రి నారాయణ ఆరోపించారు. బీదా మస్తాన్రావు సంస్థలపై ఐటీ దాడులు కుట్రపూరితమే అని మండిపడ్డారు. తమిళనాడు, కర్ణాటకలో మాదిరిగా ఏపీపై పెత్తనం చేయాలని భావిస్తున్నారని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లోని నారాయణ విద్యాసంస్థలపై ఎక్కడా కూడా ఐటీ అధికారులు దాడులు చేయలేదని వివరించారు. గుంటూరు జిల్లా టీడీపీ నేతలపై కూడా దాడులు జరుగుతాయని ముందుగా ప్రచారం జరిగింది. విజయవాడ నుంచి కొన్ని ఐటీ బృందాలు గుంటూరు వైపునకు వెళ్లడమే ఈ ప్రచారానికి కారణం.