ఆంధ్రప్రదేశ్ లోని పలుచోట్ల ఈరోజు ఐటీ శాఖ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. టీడీపీ నేత బీద మస్తాన్ రావు సహా పలువురు నేతలకు సంబంధించిన కంపెనీల్లో ఈ రోజు తనిఖీలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఈరోజు అమరావతిలో అందుబాటులో ఉన్న మంత్రులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశానికి ముందే కొందరు మంత్రులతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న విమర్శలు, రాష్ట్రంలో ఐటీ అధికారుల దాడుల అంశంపై అంతర్గతంగా చర్చ జరిగినట్టు సమాచారం.
కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరించి టీడీపీ నేతలపై ఐటీ దాడులు చేయిస్తోందని, నేతలంతా ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు. టీడీపీలోనే కాకుండా ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరుసగా టీడీపీ నేతలే టార్గెట్గా ఐటీ సోదాలు జరుగుతుండటం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బీద మస్తాన్ రావు వ్యాపార సంస్థపై ఐటీ దాడులు జరిగాయి. నిన్న మొదలైన ఈ తనిఖీలు నేడు కూడా కొనసాగాయి. కందుకూరు టీడీపీ ఎమ్మెల్యే పోతుల రామారావు, ఆయన కుటుంబసభ్యుల కంపెనీల్లో సోదాలు జరిగినట్లు సమాచారం.
టంగుటూరు మండలం చెరువుకొమ్ముపాలెంలోని సదరన్ గ్రానైట్స్ కంపెనీలో ఐటీ సోదాలు నిర్వహించింది. అలాగే జరుగుమిల్లి మండలం కె.బిట్రగుంటలో సదరన్ ట్రోపికల్ ఫుడ్స్ ఆఫీసులో ఐటీ తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. నారాయణ విద్యా సంస్థల్లో తనిఖీలు చేసేందుకు ఐటీ ప్రయత్నించడంతో ఇది కేవలం టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్య అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మోదీకి తనకు నచ్చని వారిపై ఈడీ, ఐటీలతో దాడులు చేయించడం అలవాటుగా మారిందని, భయపడాల్సిన అవసరం లేదని.. బీజేపీ కుట్రలను తిప్పి కొట్టాలని నేతలకు టీడీపీ అధినేత సూచించారు. ఇదిలా ఉంటే.. మంత్రులతో చంద్రబాబు జరిపిన సమావేశంలో కేసీఆర్ విమర్శలు కూడా చర్చకొచ్చినట్లు తెలిసింది. కేసీఆర్ విమర్శలకు ధీటుగా కౌంటర్ ఇవ్వాలని నేతలకు చంద్రబాబు సూచించినట్లు తెలిసింది.