Sidebar

03
Sat, May

అసంతృప్తితో రగిలిపోతున్న వైసీపీ నేత వంగవీటి రాధాను బుజ్జగించేందుకు ఆ పార్టీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి రంగంలోకి దిగారు. బుధవారం విజయవాడ వచ్చిన ఆయన నేరుగా రాధా ఇంటికెళ్లారు. అక్కడి నుంచి రాధాను ఓ హోటల్ కు వెంటబెట్టుకెళ్లి సుమారు రెండు గంటలకు పైగా మాట్లాడారు. సెంట్రల్ సీటు విషయంలో కాస్త పట్టు విడుపులతో ఆలోచించాలని రాధాకు విజయసాయి సూచించినట్లు సమాచారం. బుధవారం విజయవాడకు వచ్చిన ఆయన నేరుగా మొగల్రాజపురంలో ఉన్న రాధా ఇంటికి వెళ్లి కొద్దిసేప ఆయనతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరు నాయకులు కలిసి నగరంలోని ఓ హోటల్ కు చేరుకున్నారు. అక్కడ సుమారు 2 గంటలకు పైగా వీరి నడుమ ఏకాంత చర్చలు సాగాయి. ఈ సందర్భంగా రాధాను బుజ్జగించేందుకు విజయసాయి ప్రయత్నించినట్లు సమాచారం.

vijayasai 11102018 2

విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ టికెట్లు తనకు కాదని మల్లాది విష్ణుకు పార్టీ దాదాపు ఖరారు చేయడంతో రాధా కినుక వహించారు. దీంతో సెప్టెంబరు 18 నుంచి ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు విష్ణు సెంట్రల్ నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో తిరుగుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాధా పార్టీని వీడుతారన్న ప్రచారం ఊపందుకుంది. రాధాను దూరం చేసుకుంటే కాపు సామాజికవర్గంలో వ్యతిరేకత వస్తుందని భావించిన వైసీపీ అధిష్టానం విజయసాయిని రంగంలోకి దింపింది. బ్రాహ్మణులకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలన్న ఆలోచనతోనే మల్లాది విష్ణును సెంట్రల్ నియోజకవర్గానికి ఇన్ చార్జిగా నియమించామని, అంతే తప్ప రాధాను దూరం చేసుకోవాలన్న ఆలోచన పార్టీకి లేదని రాధాకు విజయసాయి తెలిపినట్లు సమాచారం.

vijayasai 11102018 3

ఈ వాదనపై రాధా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తాను ఆశిస్తున్న స్థానాన్ని వేరే వ్యక్తికి ఇచ్చేటప్పుడు తనను కనీసం సంప్రదించకపోవడం ఏమిటని నిలదీసి నట్లు సమాచారం. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా రెండు రోజులపాటు తన అనుచ రులు ఆందోళన వ్యక్తం చేసినా పార్టీ తరపున ఒక్క సానుకూల ప్రకటన వెలువడకపోగా, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విలేకరుల సమావేశం పెట్టి మరీ సెంట్రల్ సీటు ఇచ్చేది లేదని తెగేసి చెప్పడంలో పార్టీ ఉద్దేశాన్ని రాధా ప్రశ్నించినట్లు తెలిసింది. పార్టీ అధిష్టానం ఈసారి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలను రచిస్తోందని, అందులో భాగంగా సెంట్రల్ స్థానం నుంచి విష్ణును బరిలోకి దింపాలని నిర్ణయించిందని, ఈ విషయంలో రాధా కూడా కాస్త పట్టు విడుపులతో ఆలోచించాలని విజయసాయి సూచించినట్లు సమాచారం. తన నిర్ణయాన్ని ఒకటి రెండు రోజుల్లో తెలుపుతానని రాధా చెప్పినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. అయితే రాధా ఇంట్లో కాని, పరిసరాల్లో కాని, ఎక్కడా వైసీపీ జెండా కాని, ఆనవాళ్ళు కాని లేకపోవటం చూసి విజయసాయి అవాక్కయ్యారు.ఇది వరకు రాధా ఇంటి పరిసరాల్లో పెద్ద పెద్ద ఫ్లెక్స్ లు ఉండేవి. అయితే, ఇప్పుడు అవి అక్కడ నుంచి తీసేసిన సంగతి తెలిసిందే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read