రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితుడు, ప్రముఖ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు కుమారుడు శ్రీహర్ష మరణ వార్త పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కొమ్మినేని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొమ్మినేని శ్రీనివాసరావు ఏకైక కుమారుడు శ్రీహర్ష (32) కెనడాలో రెండు రోజుల కిందట మృతిచెందారు. రెండేళ్ల నుంచి క్యాన్సర్తో బాధపడుతున్న శ్రీహర్ష కెనడాలోనే చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కొద్ది రోజుల క్రితమే కొమ్మినేని శ్రీనివాసరావు దంపతులు కెనడాకు వెళ్లారు.
అయితే, ఆరోగ్యం మరింత విషమించడంతో శ్రీహర్ష కెనడాలోనే మృతి చెందారు. దీంతో కొమ్మినేని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మరణవార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు కొమ్మినేనిని ఫోన్లో పరామర్శిస్తున్నారు. అలాగే, పాత్రికేయుడు భోగాది వెంకటరాయుడి భార్య రైలు ప్రమాదంలో మృతిచెందడంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తంచేశారు. వెంకటరాయుడు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇద్దరు సీనియర్ పాత్రికేయులు తమ కుటుంబ సభ్యులను కోల్పోవడం బాధాకరమని చంద్రబాబు అన్నారు.
మంత్రి నారా లోకేష్ కూడా, సంతాపం తెలిపారు. ఒకే రోజు ఇద్దరు సీనియర్ జర్నలిస్టుల కుటుంబానికి తీరని శోకం మిగలడం తనను తీవ్రంగా కలచి వేసిందని ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీరాజ్శాఖా మంత్రి నారా లోకేష్ విచారం వ్యక్తం చేశారు. సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు కొమ్మినేని శ్రీనివాసరావు తనయుడు కొమ్మినేని శ్రీహర్ష మరణ వార్త విని తాను దిగ్భ్రాంతికి గురయ్యానని, కొడుకును క్యాన్సర్ మహమ్మారి బలిగొనడం దురదృష్టకరమని లోకేష్ విచారం వ్యక్తం చేశారు. సీనియర్ జర్నలిస్ట్ బోగాది సతీమణి మృతి పట్ల విచారం.. సీనియర్ జర్నలిస్ట్ బోగాది వెంకటరాయుడు సతీమణి రైలు ప్రమాదంలో మరణించడం పట్ల మంత్రి లోకేష్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.