ఒకప్పుడు చంద్రబాబు నీటి కుంటలు అంటే నవ్విన వారు, తాజగా చంద్రబాబు పంట కుంటలు అన్నా నవ్వారు.. కాని, కేంద్ర ప్రభుత్వం ఈ పంట కుంటల ప్రాముఖ్యత గుర్తించింది. దేశ వ్యాప్తంగా ఈ పంట కుంటల తవ్వకం మొదలు పెట్టమని రాష్ట్రాలని కోరింది. దేశమంతా పెద్ద ఎత్తున పంట కుంటలు తవ్వుతున్నాం అని చెప్పి, లక్ష వరకు పంట కుంటలు తవ్వారు. కాని మన రాష్ట్రంలోని ఒక్క అనంతపురం జిల్లాలోనే లక్ష పంట కుంటలు తవ్వి, దేశానికి ఆదర్శంగా నిలిచేలా చేసారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఒకప్పుడు అనంతపురం అంటే, కరవుకు నిదర్శనంలా నిలిచే ప్రాంతం. తీవ్ర వర్షాభావం. 500 అడుగుల లోతు బోరు వేసినా చుక్క నీరు పడని పరిస్థితి. కానీ, ఇలాంటి ప్రదేశంలో పాతాళ గంగ పై పైకి వస్తుంది. జిల్లాలో వ్యవసాయ భూముల్లో నీటిని నిల్వ చేసుకునేందుకు ప్రభుత్వం ఉపాధిహామీ పథకంలో భాగంగా పంట కుంటలు తవ్విస్తున్నారు.
దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఈ జిల్లాలో పడిన ప్రతి వాన చినుకునూ ఒడిసిపట్టి భూమిలోకి ఇంకించే ప్రయత్నం చేస్తుండడంతో, అనంతపురానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. జిల్లాలో ‘లక్ష’ పంట సంజీవని సేద్యపు కుంటలు నిర్మించి రికార్డు సొంతం చేసుకుంది. సోమవారం నాటికి 1,00,405 కుంటలు తవ్వడం పూర్తయింది. నాలుగేళ్లలో ఈ ఘనత సాధించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో నాలుగేళ్లల్లో 5,81,898 కుంటలను తవ్వారు. ఇందుకు రూ.2,225.5 కోట్లు వెచ్చించారు. 94 వేల కుంటలతో చిత్తూరు జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది. సామాజిక ఉద్యమంలా మొదలై సేద్యపు కుంటల తవ్వకం 2015-16 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో సామాజిక ఉద్యమంలా ఆరంభమైంది.
ప్రతి రైతు తమ పొలంలో కుంటను తవ్వుకునేలా చైతన్యం కల్పించారు. జిల్లాలో తొలి ఏడాది 2,075 కుంటలను తవ్వారు. 2016-17లో అప్పటి కలెక్టర్ కోన శశిధర్, పీడీ నాగభూషణం ప్రత్యేక దృష్టి సారించారు. ఆ ఏడాదే 54,272 సేద్యపు కుంటలు తవ్వించి రికార్డు నెలకొల్పారు. 2017-18లో 25,790 కుంటలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సోమవారం(8న) నాటికి 18,268 కుంటలు పూర్తి చేసి.. లక్ష కుంటలు తవ్వాలన్న లక్ష్యాన్ని సాధించారు. ఇందుకోసం రూ.542.58 కోట్లు ఖర్చు పెట్టారు. జిల్లాలో లక్ష కుంటల తవ్వకాన్ని పూర్తి చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలియజేసినట్లు డ్వామా పీడీ జ్యోతిబసు ‘న్యూస్టుడే’కు తెలిపారు.