రాఫెల్ కుంభకోణంలో నరేంద్ర మోడీ అడ్డంగా దొరిపోయారు. సమాధానం చెప్పలేక, పాకిస్తాన్ తో కలిసి కుట్ర పన్నుతున్నారు అంటూ, రాజమౌళి సినిమా కధలు చెప్తున్నారు. అయితే, ఇప్పుడు మోడీని ఈ విషయంలో మరింత ఇరుకున పెట్టటానికి, విపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్పట్లో, బోఫోర్స్ పై, అన్న ఎన్టీఆర్ చూపించిన దారిలోనే నడుస్తుందా అంటే అవును అనే సమాచారం వస్తుంది. 1989లో కాంగ్రెస్ పార్టీ పై బోఫోర్స్ కుంభకోణం బయటకు వచ్చినప్పుడు, దేశంలో ప్రాధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉండేది. ఎన్టీఆర్ సూచనల మేరకు, అప్పట్లో రాజీవ్ గాంధీ పై ఒత్తిడి తేవటానికి, విపక్ష ఎంపీలను రాజీనామా చేపించారు ఎన్టీఆర్...
అయితే ఇప్పుడు రాహుల్ కూడా అదే ఫార్ములా ఉపయోగించి, మోడీ పై ఒత్తిడి తేనున్నట్టు సమాచారం. రాఫెల్ కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయకపోతే మూకుమ్మడి రాజీనామాల దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపాయి. తద్వారా, ఇప్పటికే పీకల్లోతు చిక్కుల్లో పడిన నరేంద్ర మోదీ సర్కారును మరింత ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. నిజానికి, రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు కుంభకోణంపై జేపీసీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. కానీ, అందుకు మోదీ సర్కారు ససేమిరా అంటోంది. రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందాన్ని బట్టబయలు చేయడానికి వీల్లేదని, ఈ మేరకు భారత్, ఫ్రాన్స్ మధ్య రహస్య ఒప్పందం ఉందని చెబుతూ వస్తోంది.
కానీ, ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ తాజా ప్రకటన కాంగ్రెస్‌కు వజ్రాయుధంగా మారింది. రిలయన్స్ డిఫెన్స్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని భారత ప్రభుత్వమే సూచించిందని, దాంతో, తమకు మరో దారి లేకపోయిందని ఆయన వ్యాఖ్యానించడం సంచలనమైంది. ఈ నేపథ్యంలోనే, జేపీసీ ఏర్పాటు డిమాండ్‌ను ఉధృతం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. జేపీసీ ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించకపోతే బోఫోర్స్ స్కాం సమయంలో అప్పటి ప్రతిపక్ష పార్టీలు అనుసరించిన తరహాలోనే ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామా చేసే దిశగా ఆలోచనలు చేస్తోంది. ఇందుకు కాంగ్రెస్ ఎంపీలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మోదీ సర్కారుపై మరింత ఒత్తిడి తీసుకు రావడమే ధ్యేయంగా రాజీనామాలకు ఇతర ప్రతిపక్షాలతో కూడా కాంగ్రెస్ ముఖ్యులు చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీ్‌సగఢ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విడుదల కావడానికి ముందే దీనిపై ఓ నిర్ణయం తీసుకునే దిశగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాలన్నీ కలిసి మూకుమ్మడి రాజీనామా నిర్ణయం తీసుకుంటే మోదీ సర్కారు పూర్తిగా చిక్కుల్లో పడినట్లేనని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.