ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న వరుస పరువు హత్యలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా మిర్యాలగూడ పరువు హత్య తరహాలో ‘సోని రాహు ప్రియ’లు పరువు హత్యకు గురవుతారని విజయవాడలో పోస్టర్లు వెలిశాయి. విజయవాడ నగరంలోని సత్యనారాయణపురం శివాలయం వీధిలో ఈ పోస్టర్లను గుర్తు తెలియని వ్యక్తులు అంటించారు. దీంతో ఈ ఘటనపై పోలీసులు అప్రమత్తమయ్యారు. పోస్టర్ల విషయం తెలుసుకుని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఎవరు అంటించారు? అసలు ఈ సోని రాహు ప్రియ ఎవరు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
భయపెట్టే ఉద్దేశంతోనే ఈ పోస్టర్లను వీధిలో అంటించి ఉంటారని అధికారులు భావించి, ఆ దిశగా ఎంక్వయిరీ మొదలు పెట్టారు. ఆ యాప్రాంతాల్లో కులాంతర వివాహం చేసుకున్న యు వతీ యువకులు ఎవరైనా ఉన్నారా అని పోలీసులు ఆరా తీశారు. వారి వివరాలు తెలుసుకుంటూ ఎంక్వయిరీ ప్రారంభిస్తూనే, మరో పక్క ఆ ఏరియాలోని సీసీ కెమేరాల ఫుటేజిని పరిశీలించారు. సీసీ కెమేరాల ఫుటేజిని పరిశీలించగా, చివరకు పోలీసులుకి ఒక క్లూ దొరికింది. ఒక యువతకు ఆ పోస్టర్లు అంటిస్తూ కనిపించాడు.
దీంతో పోలీసులు విచారణ ఆ దిశగా మొదలు పెట్టారు. పోస్టర్లు అతికించిన వ్యక్తి ఎక్కడుంటాడు అనే విషయం ఎంక్వయిరీ చేసారు. చివరకు, పోస్టర్లు అతికించిన యువకుడిని పట్టుకున్నారు. అతడు ఆ ప్రాంతానికే చెందిన చిట్టి లక్ష్మీనారాయణగా గుర్తించారు. ఈ పోస్టర్లు ఎవరు అంటించమన్నారు ? ఎందుకు అంటించమన్నారు ? రాహు, సోని, ప్రియ ఎవరని అతడిని ప్రశ్నించగా, అతని వైపు నుంచి అవాక్కయ్యే సమాధానం వచ్చింది. రాహు, సోని, ప్రియ అంటే కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీల పేర్లు చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. చివరగా, అతడికి మతిస్థిమితం లేదని నిర్ధారించుకుని, ఊపిరిపీల్చుకున్నారు.