రాష్ట్రంలో సైలెంట్ గా ఉన్నారు అనుకున్న మావోయిస్టులు, ఒకేసారి పంజా విసిరారు. ఏకంగా ఎమ్మెల్యే పై దాడి చేసి, హతమార్చారు. విశాఖ జిల్లా అరకులో, ఈ దాడి జరిగింది. అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు దారుణ హత్యకు గురయ్యారు. ఘటనాస్థలంలోనే కన్నుమూసిన ఎమ్మెల్యే కిడారి కిడారి సర్వేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే సోముని కూడా మావోయిస్టులు కాల్చి చంపారు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన మావోల కాల్పుల్లో ఇరువురూ మృతి చెందారు.
కాగా ఇటీవల కాలంలో ఏజెన్సీలో మావోల పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. దీంతో అవకాశం కోసం మావోయిస్టులు ఎదురుచూస్తున్నారు. ప్రజా ప్రతినిధులను టార్గెట్‌గా చేసుకుని నిర్ణయించారు. ఇందులో భాగంగానే కిడారి సర్వేశ్వరరావుని టార్గెట్ చేసినట్లు భావిస్తున్నారు. కిడారి ఇటీవలే వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. డంబ్రీగూడ మండలం లిప్పిటిపుట్టు దగ్గర ఈ దాడి జరిగింది. కార్యకర్తలతో కలిసి, బస్సులో వెళ్తూ ఉండగా, ఈ దాడి జరిగినట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యేని దించి, ఆయన్ను కాల్చినట్టు చెప్తున్నారు.
ఒకేసారి 150 నుంచి 200 మంది మావోయిస్టులు బస్సుని అడ్డగించి,ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ దాడి ఎందుకు జరిగింది, దీనికి కారణం ఏంటి అనేది, ఎందుకు ఈయన్నే టార్గెట్ చేసారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. మరో పక్క రాష్ట్రంలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. దాడి జరిగిన చోట పోలీసులు, నక్సల్స్ కోసం గాలింపు చేస్తున్నారు. మొత్తం ఏరియా మొత్తం జల్లిడి పడుతున్నారు.