ఎమ్మెల్యేల పని తీరు ఎలా ఉంది.. వారి బలాలు ఏంటి, వైఫల్యాల ఏంటి అనే దాని పై నివేదికలు రూపొందించినట్లు ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వాటిని త్వరలో మీ చేతికే ఇస్తానని, లోపాలను సవరించుకుంటారో, లేదో మీ ఇష్టం అంటూ ఎమ్మెల్యేలను హెచ్చరించారు చంద్రబాబు. నిన్న రాత్రి అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తరువాత, శాసనసభ ఆవరణలో జరిగిన తెలుగుదేశం లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో చంద్రబాబు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రభుత్వ పనితీరు, వివధ పథకాల విషయంలో ప్రజల అభిప్రాయం ఎలా ఉంది ? అని చంద్రబాబు తొలుత ఎమ్మెల్యేలను అడిగారు. శాసనసభ్యులు అందరూ ప్రజల్లో చాలా సానుకూల స్పందన ఉందని చెప్పినట్లు తెలిసింది.
అప్పుడు చంద్రబాబు స్పందిస్తూ, అయితే మీరందరూ గెలవాలి కదా, మరి కొన్ని చోట్ల కొంత మంది గెలుపు పై ఎందుకు అనుమనాలొస్తున్నాయి ? అని ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. దానికి ఆయనే సమాధానం చెప్తూ మీ పని తీరు, నడవడికలో లోపం వలనే అలాంటి అనుమానాలు వస్తున్నాయని కరాఖండిగా చెప్పినట్లు తెలిసింది. శాసనసభ్యుల పనితీరు, నడవడిక పై నియోజకవర్గాల వారీ ప్రత్యేక సమావేశాన్ని సేకరించినట్లు తెలిపారు. అందుకు సంబంధించి నివేదికలు కూడా సిద్ధమయ్యాయని, త్వరలో ఎవరివి వారికి ఇస్తానని తెలిపారు. మీకు ఆ కవర్లు త్వరలోనే వస్తాయి అంటూ చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తుంది.
ఎన్నికల సమయం ఆసన్నమవుతున్న సమయంలో ఆ నివేదికల్లో ఉన్న లోపాలను వెంటనే సవరించుకోకపోతే తానేమీ చేయలేనంటూ హెచ్చరించినట్లు తెలిసింది. అటు అభివృద్ధి పనులతో పాటు, ఇటు సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తున్నప్పటికీ కొంత మంది వాటిని ప్రజలకు వివరించలేకపోతున్నారని కూడా సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. అందుకోసమే గ్రామదర్శిని-గ్రామ వికాసం కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో నిర్వహించాలని సూచించారు. ఆ కార్యక్రమాన్ని బాగా చేస్తున్న వారిని అభినందిస్తూనే మిగిలిన వారు వెంటనే దాని నిర్వహణపై దృష్టి పెట్టాలని లేని పక్షంలో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇప్పుడు ఎమ్మెల్యేలకు కవర్ ఎప్పుడు వస్తుందా, దాంట్లో ఏమి ఉంటుందా అనే టెన్షన్ పట్టుకుంది.