అమరావతిని వైద్య, ఆరోగ్య రంగాల్లో అగ్రస్థానంలో నిలపడంలో ఎంతైనా దోహదపడ గలదని ఆశించిన ఇండో- యూకే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెడిసిటీ ప్రాజెక్ట్ యాజమాన్యానికి ఏపీసీఆర్డీయే నోటీసులు ఇచ్చింది. ఆ సంస్థకు తాను కేటాయించిన మొత్తం 150 ఎకరాల్లోని 50 ఎకరాల్లో తొలిదశ పనులను ఎంతకీ ప్రారంభించకపోవడం ఇందుకు కారణం. గతేడాది ఆగస్టులో పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రుల సమక్షంలో దీనికి శంకుస్థాపన జరగ్గా, ఇంతవరకూ పనులు మొదలవలేదు. దీంతో ఎన్ని సార్లు సీఆర్డీయే సంప్రదించినా, ఆ సంస్థ నుంచి సరైన సహకారం రాకపోవటంతో, సీఆర్డీయే ఈ నిర్ణయం తీసుకునట్టు తెలుస్తుంది.
ఒప్పందం ప్రకారం ఈ పనులు సుమారు 9, 10 నెలల క్రితమే మొదలవ్వాల్సి ఉండగా అలా జరగకపోవడంతో ఇంతకుముందు కూడా సీఆర్డీయే సదరు యాజమాన్యానికి నోటీసులు ఇచ్చిందని, ఇప్పుడు పంపినవి మరోవిడతవి అని సమాచారం. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైనదిగా పేరొందిన లండన్‌లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్‌తో కలసి మన రాజధానిలో దీనిని స్థాపించేందుకు ఇండో- యూకే హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ముందుకు వచ్చింది. అయితే ఈ భారీ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన జరిగి 13 నెలలు పూర్తయినా ఇంతవరకూ నిర్మాణ పనులు ప్రారంభమే కాలేదు. వాటిని వెంటనే చేపట్టాల్సిందిగా తాను ఎప్పటికప్పుడు చేస్తున్న హెచ్చరికలతో ఫలితం లేకపోవడంతో సీఆర్డీయే మరోసారి ఆ సంస్థకు నోటీసులిచ్చినట్లు తెలిసింది.
అత్యాధునిక 1,000 పడకల ఆస్పత్రి, వైద్య, నర్సింగ్ కళాశాలలు, పారామెడిక్ ట్రైనింగ్ స్కూల్, అత్యాధునిక క్యాన్సర్ చికిత్స- పునరావాస కేంద్రం, ఐబీఎం ఆసియా డేటా అనలిటిక్స్ సెంటర్, ఇంప్లాంట్ల తయారీ పరిశ్రమ, స్టెమ్ సెల్స్ పరిశోధనా కేంద్రంతోపాటు రోగులు, సందర్శకుల కోసం 5 స్టార్, 3 స్టార్ హోటళ్ల వంటివి నెలకొల్పుతాననడంతో సీఆర్డీయే దానికి మొత్తం 150 ఎకరాలను కేటాయించింది. ఇందులోని 50 ఎకరాలను తొలి దశగా అప్పగించింది. మిగిలిన 100 ఎకరాలను తర్వాత ఇవ్వనుంది. నోటీసులు ఇచ్చిన నేపధ్యంలో, మరి ఈసారైనా ప్రయోజనం ఉంటుందో, లేదో చూడాలి.