వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధుల విడుదలలో కేంద్రం వివక్షపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో వెనుకబడిన జిల్లాలకు నిధులు విడుదల చేసి... ఏపీకి మొండిచేయి చూపడంపై ‘ఆంధ్రజ్యోతి’లో వార్తా కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ నిధులపై మంగళవారం ఇక్కడ సంబంధిత అధికారులతో సీఎం సమీక్షించారు. ఈ వివక్షను ప్రశ్నిస్తూ కేంద్రానికి ఘాటుగా లేఖ రాయాలని నిర్ణయించారు. ఇదే పద్దు కింద గతంలో రూ.350 కోట్లు ఇచ్చి కేంద్రం మళ్లీ వెనక్కు తీసుకోవడాన్ని కూడా లేవనెత్తాలని నిశ్చయించారు. సీఎం లేఖకు ప్రతిస్పందన రానిపక్షంలో టీడీపీ ఎంపీల బృందం వచ్చేవారం ఢిల్లీ వెళ్లి అక్కడ మంత్రులు, అధికారులను కలిసి గట్టిగా నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలోని 7 వెనుకబడిన జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ వివక్షను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కూడా నిర్ణయించారు. కేంద్రం వివక్షపై బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీలు నోరు తెరవకపోవడంపైనా గట్టిగా ప్రశ్నించాలని నిర్ణయానికొచ్చారు. తెలంగాణలో వెనుకబడిన జిల్లాలకు రూ.450 కోట్లు ఇచ్చి.. ఏపీలో వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించకపోవడం సమంజసమేనా అని రాష్ట్ర భూగర్భ గనుల మంత్రి సుజయకృష్ణ రంగారావు కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. 2017-18, 2018-19 సంవత్సరాలకు సంబంధించి వెనుకబడిన జిల్లాలకు వెంటనే రూ.700 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తున్నా.. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించడంలేదని ప్రశ్నించారు. కేంద్రంతో చేసుకున్న చీకటి ఒప్పందాలను వారు బయటపెట్టాలని మంగళవారం సచివాలయంలో డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలు అన్యాయం గురించి ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న జగన్, పవన్ ఏ ముఖంపెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.