‘తితలీ’ తుఫాను బీభత్సంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పకప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రాత్రికి జిల్లాలోనే బస చేయనున్న సీఎం సహాయపునరావాస చర్యలను దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. తిత్లీ తుపాను ప్రభావం నుంచి ప్రాణ, ఆస్తి నష్టం నివారణపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ వహించారు.
‘తితలీ’ తుపాను తీరం దాటనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటిమీద కునుకు లేకుండా గడిపారు. తుపానుపై రాత్రంతా అప్రమత్తంగా ఉన్న సీఎం ప్రతి రెండు గంటలకు ఒకసారి సమీక్ష నిర్వహించారు. ఆర్టీజి, ఇస్రో అధికారుల నుంచి తుపాన్ కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించారు. ఆర్టీజి ద్వారా శ్రీకాకుళం అధికారులకు తుపాన్ సమాచారం అందజేశారు. తెల్లవారుజామున వాయుగుండం తీరాన్ని దాటినట్లు సమాచారం అందడంతో దాని ప్రభావంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. "తిత్లీ తుపాను తీవ్రతను నివారించడం సాధ్యకాకపోయినప్పటికీ నష్ట నివారణను ఎదుర్కోవడంలో అప్రమత్తతతో వ్యవహరించడం ముఖ్యమని చెప్పారు. తుపాను ప్రభావాన్ని ఉదయం వరకూ పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడం అత్యవసరమని అధికారులకు సూచించారు.
బుధవారం రాత్రి ఉత్తరాంధ్ర కలెక్టర్లు, పోలీసులు, విపత్తు నిర్వహణ, వాతావరణ, జలవనరుల శాఖల అధికారులతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్థరాత్రి దాటినా ఏ సమయంలోనైనా తిత్లీ తుపానుపై చర్యలకోసం తనను సంప్రదించడంలో అలసత్వం వద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అంగన్ వాడీ పాఠశాలకు సైతం సెలవులు ప్రకటించాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో తితలీ తుఫాను తీరం దాటిన నేపథ్యంలో ఆర్టీజీఎస్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాల్ సెంటర్ నుంచి ఎస్ఎంఎస్ ద్వారా వరద హెచ్చరిక సందేశాలను జారీ చేశారు. సహాయం కోసం 1100 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు. అటు విజయనగరం కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఫోన్ 08922236947, టోల్ ఫ్రీ నెంబర్ 1077ను, అలాగే విశాఖ కలెక్టరేట్లో కాల్ సెంటర్ నెంబర్ 1800 4250 0002కు ఫోన్ చేసి సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.