అనుభవం లేదు, అవగాహన లేదు, ఏం చేయాలో తెలియదని చెప్పే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏ అర్హతతో ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఎక్సైజ్ మంత్రి కేఎస్ జవహర్ ప్రశ్నించారు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడతారో తెలియని ఆయన.. పౌరుషం గురించి మాట్లాడడం విచిత్రంగా ఉందన్నారు. కాంగ్రెస్ నాయకులను పంచెలు ఊడేలా కొట్టాలని పిలుపిచ్చిన ఆయనకు.. అదే పార్టీలో ప్రజారాజ్యాన్ని విలీనం చేసినప్పుడు ఆ పౌరుషం ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం పవన్‌కు బహిరంగ లేఖ రాశారు. గత ఎన్నికల్లో కేసీఆర్‌ను తాట తీస్తానని హెచ్చరించి.. రాజకీయ లబ్ధి కోసం ఆయనతోనే మిలాఖత్ అయ్యారని విమర్శించారు.
‘బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై ప్రతి 15 నిమిషాలకు ఒక అత్యాచారం, హత్య జరుగుతున్నాయి. గత నాలుగున్నరేళ్లలో 52 వేల అత్యాచారాలు జరిగాయి. 11 మందిని కాల్చి చంపారు. వీటిపై బీజేపీని మీరెందుకు ప్రశ్నించడం లేదు? ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టాన్ని కేంద్రం నీరుగార్చాలని ప్రయత్నించినప్పుడు మీరెక్కడకు వెళ్లారో చెప్పాలి. గత ప్రభుత్వాల హయాంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కోసం కేటాయించిన రూ.22 వేల కోట్లను దారి మళ్లించారు. ఇడుపులపాయకు రోడ్లు వేసుకున్నారు. గిరిజనులకే సొంతమైన 1.6 లక్షల ఎకరాలను వైఎస్ అల్లుడికి కట్టబెట్టిన విషయాలు తెలియవా? అసలు దళితులంటేనే గిట్టని జగన్ వ్యక్తిగతంగా మిత్రుడు ఎలా అయ్యారో మీరే చెప్పాలి.
దళితుల అభివృద్ధి కోసం నాలుగున్నరేళ్లలో రూ.48 వేల కోట్లు ఖర్చుచేసిన టీడీపీ శత్రువు ఎలా అయిందో కూడా వివరించాలి. అధికారంపై ఆశ లేదంటూనే, నన్ను సీఎంను చేయాలని ప్రజలను వేడుకోవడాన్ని ఏమనాలోచెప్పండి. ప్రశ్నించడానికే వచ్చానంటూ ఎప్పుడూ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు. కేసీఆర్‌ను బాబాయిగా, కవితను చెల్లెమ్మగా, కేసీఆర్ కుటుంబమే దేవుడు ఇచ్చిన గొప్ప వరంలా మీరు అభివర్ణించడం దేనికి సంకేతం’ అని మంత్రి లేఖలో ప్రశ్నించారు.