మంత్రి దేవినేని ఉమా నిన్న, విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళ్లారు. ఆయన ఆ సమయంలో చేసిన, పనితో అక్కడ ఉన్న ప్రజలు ఉమాని మెచ్చుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి... బుధవారం సాయంత్రం అనంతపురం జిల్లా పర్యటన నుండి విజయవాడ చేరుకున్న మంత్రి దేవినేని నేరుగా విజయవాడ ఫ్లై ఓవర్ వద్ద గల వినాయకుడి గుడికి చేరుకొని, అక్కడనుండి ఉచిత దర్శనం కాలినడకన కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లారు. ఉచిత క్యూలైన్లలో ఉన్న సమస్యలను భక్తులను అడిగి తెలుసుకుంటూ ముందుకు వెళ్లారు. ఉదయం క్యూలైన్లలో ఉన్న భక్తులు ఇబ్బంది పడుతున్నారనే వార్తలు వచ్చాయి. దీంతో ఉమా, ప్రత్యక్షంగా ఉచిత క్యూలైన్లోకి వెళ్లి, అక్కడ ప్రజలు పడుతున్న సమస్యలు, ఆయన స్వయంగా చూసి, ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
ఒక మహిళా భక్తురాలు మంత్రి దేవినేనితో మాట్లాడుతూ, వీఐపీలు ప్రత్యేక దర్శనానికి వెళుతుంటే తమకు చాలా కోపం వచ్చేదని, మీరు ఇలా సామాన్య భక్తుల్లా క్యూలైన్ లో వెళుతుంటే, తాము కూడా ప్రేరణ పొంది, మీరే వెళ్తున్నప్పుడు మాకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని, మాకు ఇంకా ఉత్సాహంగా ఉంది. మీలాంటివారు ఉండటం వల్ల మాలాంటి భక్తులకు ఉత్సాహం వస్తుందని, ఏది ఏమైనా మీరు సామాన్య భక్తుల్లా రావడం చాలా అభినందించదగ్గ విషయమని అన్నారు. కొంత మంది భక్తులు మీరు విఐపి దర్శనం లైన్లో వెళ్ళవచ్చు కదా అని మంత్రికి సూచించారు. కానీ మంత్రి దేవినేని సామాన్య భక్తుల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి తాను ఇలా వెళ్తున్నానని గత 14 సంవత్సరాలుగా ఇలా వెళ్తున్నానని, అప్పుడే నాకు సమస్యలు తెలుస్తాయి కానీ విఐపి దర్శనం లోకి పోతే మీ సమస్యలు నాకెలా తెలుస్తాయి. నేను అధికారులకు ఎలా చెప్పగలను అని అన్నారు.
గుడి వద్దకు చేరుకున్న మంత్రి దేవినేని కి ఆలయ ఈవో చైర్మన్ మరియు అధికారులు స్వాగతం పలికారు. వెంటనే మంత్రి దేవినేని క్యూలైన్లలో తాను గమనించిన సమస్యలను వారికి చెప్పి, వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని, సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, రేపటికి ఈ సమస్యలు ఉండ కూడదని వారిని ఆదేశించారు. క్యూలైన్లలో తమకు సమస్యలు చెప్పిన మహిళలను ఆలయ ఈవోతో మాట్లాడించారు. అనంతరం దూరం నుండే కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి దేవినేనికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వీఐపీల సేవలో తరించటానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా సామాన్య భక్తులకు ప్రాముఖ్యత ఇచ్చి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం చేయించాలని ఇందుకు ఆలయ ఈవో చైర్మన్ మరియు అధికారులకు తగు సూచనలు ఇస్తూ వాటిని సక్రమంగా అమలు చేసి భక్తుల మన్ననలను పొందాలని అన్నారు.