అధికారంలో ఉన్నాం కదా అని విర్రవీగితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భైరవానితిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు అందించే కార్యక్రమంలో భాగంగా ఆయన బుధవారం అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఇవాళ ఉదయం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకున్న సీఎం... అక్కడి నుంచి హెలికాప్టర్లో గుమ్మఘట్ట మండలానికి చేరుకున్నారు. భైరవానితిప్ప ప్రాజెక్టు వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి బీటీ ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు పైలాన్ ఆవిష్కరించారు. ఆ తరువాత దేశంలో ఎక్కడా లేని విధంగా లక్ష నీటి కుంటలు జిల్లాలో పూర్తైన సందర్భంగా లక్షవ నీటి కుంటను సందర్శించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాను కరవు నుంచి దూరం చేసేందుకు ప్రత్యేకంగా చొరవ చూపుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే లక్ష నీటి కుంటలు పూర్తి చేయడం, 5లక్షల ఎకరాలకు బిందు, తుంపర సేద్య పరికరాలు అందించామని చెప్పారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్నిఅభివృద్ధి పథంలోకి తీసుకురావాలని తాము ఎంతో కృషి చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం పునర్విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని నిలదీసే తాము ఎన్డీయే నుంచి వైదొలిగామని... అప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వెనుకబడిన 7 జిల్లాల్లో అభివృద్ధి నిమిత్తం విడుదల చేసిన నిధులను సైతం కేంద్రం వెనక్కి తీసుకుందని.. ఇది న్యాయమేనా? అని ప్రశ్నించారు.
మన రాష్ట్రంలో రెండుమూడు పార్టీలున్నాయని, అందులో ఒకటి వైసీపీ అని.. అది అవినీతి పార్టీ అని ఆయన విమర్శించారు. అడ్డంగా దొరికారని, సీబీఐ ఎంక్వైరీలు ఎదుర్కున్నారని.. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల కాళ్లు పట్టుకుని కేసుల మాఫీ కోసం ప్రయత్నిస్తున్నారని.. రాష్ట్ర ప్రయోజనాలు ఏ మాత్రం పట్టవని వైసీపీపై పరోక్ష విమర్శలు చేశారు. వైసీపీ ఎంపీలు ఎన్నికలు రావని తెలిసి రాజీనామా చేశారని సీఎం ఆరోపించారు. జైలుకెళ్తారనే భయంతో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని జగన్ను విమర్శించారు. జనసేన తరపున పవన్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేశారని, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఎందుకు ప్రశ్నించడం లేదని చంద్రబాబు పవన్ను ప్రశ్నించారు. తనకు మెచ్యూరిటీ లేదని.. తెలంగాణ సీఎంకు మెచ్యూరిటీ ఉందని మోదీ అన్నారని, ఎన్డీఏ నుంచి బయటకు రాగానే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో మహాకూటమిలో చేరితే విమర్శిస్తున్నారని, టీడీపీ తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ అని.. ఎవరికి ఇబ్బంది ఉన్నా అందరినీ ఆదుకుంటుందని చంద్రబాబు చెప్పారు.