విశాఖపట్నం ఏజెన్సీ పాడేరులో “మన్యం గిరిజనుల” పేరుతో కనిపిస్తున్న పోస్టర్లు కలకలం రేపాయి. గిరిజన నేతలు కిడారి సర్వేశ్వర్రావు, సివేరి సోమ హత్యలను నిరసిస్తూ ఈ పోస్టర్లు వెలిసాయి. పాడేరు బస్టాండ్‌తోపాటు, అంబేద్కర్ సెంటర్లోనూ వీటిని అతికించించారు. మావోలు బలంగా ఉన్న చోట, వారి పై ఇంత ధైర్యంగా, వ్యతిరేక పోస్టర్లు రావటంతో, అందరూ అవాక్కయ్యారు. అమాయక ప్రజల్ని చంపే కర్కశత్వం మావోయిస్టులది.. ప్రజాసేవే పరమావధి మా నాయకులది అంటూ వీటిల్లో రాశారు.
కిడారి, సివేరి మా హీరోలంటూ పేర్కొన్నారు. పిరికిపంద చర్యలకు పాల్పడిన మావోయిస్టులు జీరోలు అంటూ.. పట్టణంలో ఈ పోస్టర్లు అంటించారు. గిరిజన నేతల్ని చంపడం నూతన ప్రజాస్వామ్యా అంటూ మావోయిస్టులను సూటిగా ప్రశ్నించారు. మావోయిస్టులే అసలైన గిరిజన ద్రోహులంటూ గోడపత్రికల్లో ప్రముఖంగా రాశారు. నక్సలైట్ల ఉన్మాదాల పాపం పండిందని, కర్కసత్వానికి కాలం చెల్లిందని హెచ్చరించారు. రెండు రోజుల క్రితం కూడా, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ ఆత్మఘోష పేరుతో కరపత్రం విడుదలయింది.
కరపత్రంలో... ‘నేనొక మాజీ ఎమ్మెల్యేని, ఆరుగురు పిల్లలు, భార్య కలవాడిని, ఎదిగొచ్చిన కొడుకులకు ఉద్యోగాలు కూడా లేవు, సొంత ఇల్లు కూడా లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నాను. నేనేం తప్పు చేశాను? ఒకవేళ తప్పు చేసి ఉంటే ఒక వార్నింగ్ అయినా ఇచ్చారా? లేదు. నన్నెందుకు చంపారు? ఇంత వరకు చెప్పలేకపోయారు? నేను ఏవర్గానికి శత్రువుని? మావోయిస్టులారా చెప్పండి? కుహనా హక్కుల సంఘలైనా మీరైనా చెప్పండి ? అంటూ పేర్కొంది. ఈ ప్రశ్నల దిగువున సివేరి సోమ అంటూ హత్యకు గురై రక్తపు మడుగుల్లో చనిపోయిన మృతదేహం ఫొటోతో పాటు పాస్‌పోర్టు ఫొటో కూడా ముద్రించి ఉంది. ఎర్రని పేపర్లో పసుపు అక్షరాలతో కరపత్రం విడుదల చేశారు. ఈ కరపత్రం వాట్సాప్‌ల్లో హల్చల్ చేస్తోంది.