ఎలక్ట్రానిక్స్ రంగంలో రాష్ట్రానికి రూ.35వేల కోట్ల పెట్టుబడులు రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న 500 బిలియన్ డాలర్ల ఎలక్ర్టానిక్స్‌లో రాష్ట్రం నుంచే 250 బిలియన్ డాలర్ల విలువైనవి ఉత్పత్తి అయ్యేలా చూస్తున్నామన్నారు. సోమవారం అమరావతి సచివాలయంలో మంత్రి లోకేశ్ విలేకరులతో మాట్లాడారు. తన 7 రోజుల చైనా పర్యటన విజయవంతమైందని చెప్పారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం న్యూచాంఫియన్ వార్షిక సమావేశాలు, ఇతర 40 సమావేశాల్లో పాల్గొన్నట్లు చెప్పారు. బ్లాక్ చైన్, డ్రోన్ వంటి టెక్నాలజీతో రాష్ట్రంలో 4వ పారిశ్రామిక విప్లవం వస్తుందన్నారు. ఎలక్ర్టానిక్స్ రంగానికి షన్‌జన్ ఎలాగో తిరుపతి అలాగే ఎలక్ర్టానిక్స్ హబ్‌గా తయారవుతుందని చెప్పారు. అవసరమైతే 3, 4 నెలల్లో మళ్లీ చైనా వెళతానని, మరికొన్ని ఒప్పందాలు చేసుకువస్తానని తెలిపారు.
ఎలక్ర్టానిక్స్ రంగంలో ప్రపంచంలో 2 స్థానంలో ఉన్న టీసీఎల్... ఏపీలో పరిశ్రమ నెలకొల్పడానికి ఒప్పందం చేసుకున్నట్లు లోకేష్ తెలిపారు. ఈ కంపెనీ ద్వారా 6 వేల మందికి ఉపాధి లభిస్తుందని, నవంబరు చివరివారంలో ఆ కంపెనీ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ఈ లోగా డీపీఆర్, 135 ఎకరాల భూమి కేటాయింపులు వంటి పనులు పూర్తి అవుతాయన్నారు. భాగస్వామ్య సదస్సులు, ఇప్పటి వరకూ జరిగిన ఎంవోయూల ద్వారా రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో 35 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆయన చెప్పారు. 1994లో ఐటీ రంగానికి ఎలా పేరు వచ్చిందో.. ఇప్పుడు ఎలకా్ట్రనిక్స్‌రంగానికి కూడా అలాగే అవకాశాలు లభిస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల లోపు 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో కంపెనీలు ఏర్పాటవుతాయన్నారు.
ఈ నెల 4వ తేదీన డిక్సన్ ప్లాంట్‌ను తిరుపతిలో సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని మంత్రి చెప్పారు. తిరుపతి రేణిగుంటలోని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లో టీవీలు,సెక్యురిటి కెమెరాలుని డిక్సన్ కంపెనీ తయారు చేయ్యనుంది. త్వరలో సెల్ ఫోన్లు, వాషింగ్ మెషిన్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీని ప్రారంభించేందుకు డిక్సన్ కంపెనీ రెడీ అవుతుంది. రేణిగుంట ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 2 లో మొట్టమొదట కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీగా డిక్సన్ కంపెనీ పేరు తెచ్చుకుంది. మార్కెట్లోని వివిధ కంపెనీలకు డిక్సన్ ఎలక్ట్రానిక్ వస్తువులు తయారీ చేసి ఇస్తుంది. ఈ కంపెనీ రాష్ట్రంలో 150 కోట్ల పెట్టుబడులు పెట్టింది. పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభం అయితే 2000 మందికి ఉద్యోగాలు రానున్నాయి.