రాజధాని ప్రాంతానికి ఐటీ కళను తీసుకురానున్న హెచ్‌సీఎల్ టెక్నాలజీ పార్కు నిర్మాణ పనులకు ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 8వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు ఐటీ మంత్రి లోకేశ్ దీనికి భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఎల్ కార్పొరేషన్ సీఈఓ రోషిణీ నాడార్ మల్హోత్రా, హెచ్‌సీఎల్ హెల్త్‌కేర్ వైస్ చైర్మన్ శిఖర్ మల్హోత్రా, హెచ్‌సీఎల్-విజయవాడ డైరెక్టర్ ఆర్.శ్రీనివాసన్ తదితరులు పాల్గొంటారు. ఆకట్టుకునే ఆర్కిటెక్చర్ నైపుణ్యంతో కూడిన భవన సముదాయ నమూనాలను హెచ్‌సీఎల్ విడుదల చేసింది.
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి అభిముఖంగా పచ్చటి ప్రకృతి నడుమ దీనిని నిర్మించనున్నారు. టెక్నాలజీ పార్కులో మొత్తం మూడు బహుళ అంతస్థుల భవనాలను నిర్మిస్తారు. వీటికి అభిముఖంగా వలయాకారంలో మరో భవనం నిర్మిస్తారు. విమానాశ్రయానికి సమీపంలో ఉన్నందున... ఎయిర్‌పోర్ట్ అథారిటీ అనుమతించిన ఎత్తులోనే భవనాలను నిర్మిస్తారు. మొత్తం 27 ఎకరాల్లో హెచ్‌సీఎల్ టెక్నాలజీ పార్కు ఏర్పాటవుతుంది. ‘ఫార్చూన్’ కంపెనీల జాబితాలో హెచ్‌సీఎల్ 650 స్థానంలో ఉంది. 41 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మన దేశంలో 140 చోట్ల హెచ్‌సీఎల్ కార్యాలయాలు ఉన్నాయి.
ఈ సంస్థలో మొత్తం 1.24 లక్షల మంది పని చేస్తున్నారు. ఐటీ, అర్‌అండ్‌డీ రంగాలలో హెచ్‌సీఎల్‌కు ఎంతో పేరుంది. విజయవాడలో హెచ్‌సీఎల్‌కు ప్రభుత్వం ఎకరం రూ.16 లక్షలకు కేటాయించింది. ఈ సంస్థ స్థలాన్ని స్వాధీనం చేసుకున్న వెంటనే అభివృద్ధి పనులు మొదలుపెట్టింది. స్పెషల్ ఎకనమిక్ జోన్ (సెజ్) కింద టెక్నాలజీ పార్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో భూమి పూజలో ఆలస్యం జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ అనుమతులు రావడంతో... ఇప్పుడు నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు.