దేశానికి ఎనలేని సేవలందించిన మహానేతలు గాంధీజీ, లాల్‌బహుదూర్ శాస్త్రి జన్మించిన రోజున ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతిలోని ప్రజావేదిక హాలులో ‘యువనేస్తం’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా 13 జిల్లాల నుంచి వచ్చిన 400 మంది లబ్ధిదారులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా, ఒక యువకుడు చంద్రబాబుని ఉద్దేశించి, మీరు యువకుడిగా ఉండగా, ఏమని అవుదామని అనుకున్నారు అంటూ, ప్రశ్న అడిగాడు. దానికి చంద్రబాబు సమాధనం చెప్పారు.
నేటి తరం యువతకు తమ భవిష్యత్తుపై ఓ ఆలోచన ఉండాలని, దాన్ని సాకారం చేసుకునేందుకు కృషి చేయాలి. నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు, ఎంఏ చేసేటప్పుడు అనుకున్నాను. ఏం చేద్దామని ఆలోచించాను. ఐఏఎస్ చేద్దామనుకున్నాను. ఐఏఎస్ చేయాలంటే కష్టపడాలి. ఇప్పట్లో మనం ఐఏఎస్ అవుతామో లేదో రిస్క్ అవుతుందని ఆలోచించి... నెక్ట్స్ నాకు 72లో ఎలక్షన్స్ వచ్చాయి. బెటర్ టూ కంటెస్ట్ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే అయిన తరువాత మంత్రి అవుదాం. ఐఏఎస్ ఆఫీసర్లను మనమే కంట్రోల్ చేయవచ్చని ఆలోచించాను" అన్నారు. చంద్రబాబు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ, తాను యువకుడిగా ఉండగా ఉన్న ఆలోచనలు పంచుకుంటుంటే, ఆడిటోరియం చప్పట్లు, నవ్వులతో దద్దరిల్లింది.
ఈ కార్యక్రమం గురించి చంద్రబాబు మాట్లాడుతూ, దేశంలోనే యువతరం ఎక్కువగా ఉన్న దేశం మనదేనని తెలిపారు. అర్హులైన యువత ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటే వారి ధ్రువపత్రాలను అధికారులు పరిశీలించి పథకాన్ని వర్తింపచేస్తారని తెలిపారు. ఈ పథకానికి 6.15లక్షల మంది నమోదు చేసుకోగా... వెరిఫికేషన్ తర్వాత సుమారు 2.15లక్షల మంది అర్హత సాధించినట్లు తెలిపారు. వీరి బ్యాంక్ అకౌంట్‌కు ప్రయోగాత్మకంగా నిన్ననే రూపాయి జమ చేశామని.. మిగిలిన రూ.999 రేపు జమ అవుతుందని చెప్పారు. గతంలో ఇలాంటి పథకాలు కొన్నిచోట్ల ప్రారంభించినా విఫలమయ్యాయని.. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పకడ్బందీగా ఈ పథకాన్ని రూపొందించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.