మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ ఆత్మఘోష పేరుతో కరపత్రం విడుదలయింది. ఈ కరపత్రం వాట్సాప్‌లో హల్చల్ చేస్తోంది. కరపత్రంలో... ‘నేనొక మాజీ ఎమ్మెల్యేని, ఆరుగురు పిల్లలు, భార్య కలవాడిని, ఎదిగొచ్చిన కొడుకులకు ఉద్యోగాలు కూడా లేవు, సొంత ఇల్లు కూడా లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నాను. నేనేం తప్పు చేశాను? ఒకవేళ తప్పు చేసి ఉంటే ఒక వార్నింగ్ అయినా ఇచ్చారా? లేదు. నన్నెందుకు చంపారు? ఇంత వరకు చెప్పలేకపోయారు? నేను ఏవర్గానికి శత్రువుని? మావోయిస్టులారా చెప్పండి? కుహనా హక్కుల సంఘలైనా మీరైనా చెప్పండి ? అంటూ పేర్కొంది. ఈ ప్రశ్నల దిగువున సివేరి సోమ అంటూ హత్యకు గురై రక్తపు మడుగుల్లో చనిపోయిన మృతదేహం ఫొటోతో పాటు పాస్‌పోర్టు ఫొటో కూడా ముద్రించి ఉంది. ఎర్రని పేపర్లో పసుపు అక్షరాలతో కరపత్రం విడుదల చేశారు. ఈ కరపత్రం వాట్సాప్‌ల్లో హల్చల్ చేస్తోంది.
మావోయిస్టుల చేతిలో హతమైన మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబీకులు తమను ఆదుకోవాలంటూ సీఎం చంద్రబాబునాయుడుకు వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గ ప్రజలకు పెద్ద దిక్కుగా ఉన్న సోమ మరణంతో ఆయన మీద ఆధారపడి ఉన్న తాము దిక్కులేని వారమయ్యామని తెలిపారు. కనీసం సొంత ఇల్లు కూడా లేదని చెప్పారు. అలాగే సోమకు స్మారక స్థూపం ఏర్పాటు చేయాలని, పార్టీలో సముచిత స్థానం కల్పించాలని, పిల్లలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇంటి నిర్మాణానికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరారు. వీటికి సీఎం సానుకూలంగా స్పందించారు.
అరకు వెళ్లిన ముఖ్యమంత్రి సోమ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున ఆ కుటుంబానికి ఆర్థికసాయం ప్రకటించారు. ఏడుగురు కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. అలాగే తెదేపా తరఫున ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున ఇవ్వడమే కాకుండా సోమ రెండో కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతోపాటు విశాఖలో ఇంటి స్థలం.. అరకులో నిర్మాణంలో ఉన్న ఇంటిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్న సీఎం.. సౌమ్యుడైన సోమను హతమార్చడం దారుణమన్నారు. సోమ కుటుంబానికి రాజకీయంగా కూడా సముచిత ప్రాధాన్యం ఇస్తామని భరోసా ఇచ్చారు.