ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ తదితరులపై చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు చూపితేనే విచారణ చేపట్టగలమని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన జడ్జి శ్రావణ్ కుమార్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తోసిపుచ్చుతున్నట్లు తెలిపింది. దీంతో... పిటిషనరే వ్యాజ్యాన్ని వెనక్కి తీసుకున్నారు. పిల్ వేసే ముందు పూర్తి ఆధారాలు సేకరించి, లోతుగా అధ్యయనం చేసి రావాలని పిటిషనర్‌కు ధర్మాసనం సూచించింది. ఇటీవల తామర తంపరగా దాఖలవుతున్న పిల్స్‌లో... ప్రజాహితంకంటే ప్రచారమే ఎక్కువగా ఉంటోందని అభిప్రాయపడింది. ‘తగిన ఆధారాలు లేకుండా పిల్ వేస్తే ఎలా? కోర్టులకు జ్యోతి ష్యం తెలియదు. మా ముందున్న ఆధారాలతోనే విచారణ చేస్తాం. మేం పంచేంద్రియాలపై ఆధారపడే పని చేస్తున్నాం. 12, 13, 14 సెన్స్ లు లేవు’ అని తెలిపింది.
సమాచార చట్టం ద్వారా పూర్తి వివరాలు సేకరించవచ్చని సూచించింది. ఆర్టీఐ కింద సమాచారం ఇవ్వక పోతే అప్పీలు దాఖలు చేయవచ్చంది. కంపెనీల గురించిన సమాచారం రిజిస్ర్టార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) వద్ద ఉంటుందని, ఆర్‌బీఐ వద్ద లభిస్తుందని తెలిపింది. ‘మీ వ్యాజ్యంలో ఆధారాలకంటే ప్రశ్నలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాధారణంగా కోర్టులు పిటిషనర్‌ను ప్రశ్నిస్తాయి. ఇక్కడ మాత్రం మీరే కోర్టును ప్రశ్నిస్తున్నట్లుంది. ఆధారాలు లేకుండా కేసులు ఎలా విచారణ చేపడతామో మీకు తెలియదా?’ అని ప్రశ్నించింది. గతంలో మాజీ ఎమ్మెల్యే శంకర్‌రావు రాసిన లేఖను ఇదే హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టిందన్నారు. తన వ్యాజ్యంలో కూడా దర్యాప్తునకు ఆదేశిస్తే... వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు.
ఈ దశలో ధర్మాసనం కల్పించుకుని, ఆర్టికల్ 226 కింద కోర్టులకు ఉండే విచక్షణాధికారాలతో సుమోటోగా విచారణ చేపట్టవచ్చని వ్యాఖ్యానించింది. బాధితులు కోర్టుకు వచ్చి తమ ఆవేదన చెప్పుకొంటే పిల్‌గా స్వీకరించిన ఘటనలున్నాయని గుర్తుచేసింది. తగిన ఆధారాలు లేకుండా పిల్ వేస్తే విచారణ చేపట్టలేమని స్పష్టం చేసింది. ప్రభుత్వం చెబుతున్న సంస్థలు ఏపీలోనే కాదు భారతదేశంలో ఎక్కడా నమోదు కాలేదని పిటిషనర్ తెలిపారు. దర్మాసనం మళ్లీ జోక్యం చేసుకుని... ‘‘40 ఎకరాలను ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ ఇన్నొవా సొల్యూషన్స్ అనే సంస్థకు కేటాయించినట్లు చెబుతున్నారు. ఆ సంస్థ ఎక్కడుందో పిటిషన్‌లో తెలిపారా? భూములు కేటాయించారని చెబుతున్న సంస్థను ప్రతివాదిగా ఎందుకు చేర్చలేదు?’’ అని ప్రశ్నించింది. అయితే, పిల్ దాఖలు తర్వాత కొంత అదనపు సమాచారం లభించిందని, ఈ సమాచారాన్ని కోర్టు ముందుంచుతానని, రెండు వారాలు గడువు కావాలని కోరారు. అందుకు ధర్మాసనం నిరాకరించింది.