అరకు ఎమ్మెల్యే హత్య జరిగి ఇన్ని రోజులు అయినా నక్సల్స్ మా పనే అని లేఖ విడుదల చెయ్యకపోవటంతో, చాలా అనుమానాలు ఉన్న తరుణంలో, ఇప్పుడు విశాఖ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యకాండ వెనుక ప్రతిపక్ష వైకాపా నేతల హస్తం ఉందని విశాఖ నగర తెదేపా అధ్యక్షుడు, దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ తీవ్రంగా ఆరోపించారు. గురువారం మధ్యాహ్నం నగర పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా తరఫున పోటీచేసి విజయం సాధించిన కిడారి సర్వేశ్వరరావు తెదేపాలో చేరింది మొదలు ఆ పార్టీ నేతల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఆయన ఆరోపించారు.
మాజీ ఎమ్మెల్యే సివేరి సోమకు ఇంతవరకూ మావోల నుంచి ఎలాంటి బెదిరింపులూ లేవన్నారు. ఇద్దరు నేతలను మట్టుబెట్టిన గిరిజన గ్రామంలో వైకాపా నాయకులు ఉన్నారని, అక్కడే తెదేపా నేతలను మాటువేసి మరీ హత్య చేశారని ఆరోపించారు. మావోలే హత్య చేసి ఉంటే ఇప్పటికే ప్రకటన విడుదల చేసేవారని, ఇంతవరకూ అలాంటిది రాకపోవడం, హత్య జరిగిన తీరు, ఇతరత్రా అంశాలను లోతుగా పరిశీలిస్తే దీని వెనుక వైకాపా నేతల హస్తం ఉండవచ్చనే అనుమానాలు బలపడుతున్నాయని చెప్పారు. వాటిని నగర పోలీసు కమిషనర్(సీపీ) ముందుంచుతామని, గిరిజన నేతల హత్యపై దర్యాప్తు చేపట్టిన సిట్, నిఘా వర్గాలు తమ అనుమానాలను పరిగణిస్తూ వాస్తవాలను వెలుగులోకి తేవాలని వాసుపల్లి డిమాండ్ చేశారు.
కిడారి సర్వేశ్వరరావు హత్య జరిగిన రోజున ప్రతిపక్ష నేత జగన్ జిల్లాలో పర్యటిస్తున్నారని, కనీసం కడసారి చూపు కోసమైనా ఆయన వెళ్లకపోవడం దారుణమన్నారు. మరో పక్క హత్య జరిగిన సమయంలో అక్కడే ఉన్న ఎమ్మల్యే కార్ డ్రైవర్ చెప్పిన మాటలు కూడా ఇలాంటి అనుమానాలకి బలం చేకూరుస్తుంది. ఆ టైంలో మావోలు, పార్టీ మారి 30 కోట్లు వెనకేసుకుని, ఎంజాయ్ చేస్తున్నావ్ అని అన్నారని డ్రైవర్ చెప్పాడు. మరో పక్క, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్యకు గురైన నేపథ్యంలో ఆ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అసెంబ్లీ ఖాళీగా గుర్తించింది(నోటిఫై). అరకు స్థానం ఖాళీ అయినట్లు ఎన్నికల సంఘానికి అసెంబ్లీ ఇన్ఛార్జీ కార్యదర్శి ఎం.విజయరాజు సమాచారం పంపారు.