ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్‌పై సరైన సమాచారం లేకపోవడంతో పోలీసు ఉన్నతాధికారుల్లో గందరగోళం ఏర్పడింది. శుక్రవారం ఉదయం తుపాను ప్రాంతాలను వీక్షించేందుకు శ్రీకాకుళం నుంచి సీఎం బయలుదేరారు. ఇచ్ఛాపురం, ఇతర ప్రాంతాలను విహంగ వీక్షణం చేసిన తరువాత, పలాస ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో హెలికాప్టర్ దిగాలి. అక్కడి నుంచి సీఎం రోడ్డు మార్గాన వెళ్లాలి. ఇందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 11.30 గంటల సమయంలో సీఎం కోసం అంతా కళాశాల మైదానం వద్ద ఎదురు చూస్తుండగా... ఆయన కాశీబుగ్గ డీఎస్పీ కార్యాలయం ఎదురుగా ఉన్న హెలిప్యాడ్ వద్ద దిగినట్టు తెలిసింది.
దీంతో సీఎం కాన్వాయ్ మొత్తం హుటాహుటిన మూడు కిలోమీటర్ల దూరం పరుగులు తీసింది. అప్పటికే సీఎం హెలిప్యాడ్ నుంచి దిగిపోవడం, స్థానికులు ఆయనను చూసేందుకు దగ్గరగా వచ్చేయడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.పోలీసులు ఆయన్ను పోలీసు స్టేషన్ ప్రహరీ లోపలికి తీసుకువెళ్లి గేట్లు మూసివేశారు. కాన్వాయ్‌ను సిద్ధం చేయడానికి 20 నిమిషాల వరకు సమయం పట్టడంతో అంతవరకు ఆయన స్టేషన్ ఆవరణలోనే గడిపారు. ముందుగా సిద్ధం చేసిన ల్యాండింగ్ పాయింట్ పైలట్‌కు కనిపించకపోవడంతో డీఎస్పీ కార్యాలయంవద్ద హెలికాప్టర్ దించినట్లు తెలిసింది.
‘తిత్లీ’ పెను తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు పర్యటిస్తున్నారు. వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లిలో బాధితులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. అనంతరం తుపానుతో నష్టపోయిన రైతులందర్నీ ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. తుపాను ప్రభావిత ప్రాంత వాసులకు 50 కిలోల బియ్యాన్ని అందజేస్తామని, విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. 194 గ్రామాల్లో సహాయకచర్యలను ముమ్మరం చేశామని.. పలాసలోనే ఉండి యుద్ధప్రాతిపదికన పనులు జరిగేలా చూస్తానని చంద్రబాబు స్థానికులతో చెప్పారు.