ఈ దేశాన్ని 55ఏళ్లు పాలించిన పార్టీ.. రానున్న ఐదేళ్లలో ఏం చేయాలో ప్రణాళికలు సిద్ధం చేసుకోలేని స్థాయికి దిగజారిందని పరోక్షంగా కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. కేవలం మోదీని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారన్నారు. చాలా కాలం తరవాత ప్రజలు.. అధికారంలో ఉన్న ప్రభుత్వమే తిరిగి రావాలనుకోవడం చూస్తున్నానని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు సైతం ఇంటింటికీ తిరిగి ప్రస్తుత ప్రభుత్వానికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మహారాష్ట్రలోని మాధాలో జరిగిన సభలో పాల్గొన్నారు. ప్రజల ఆశీస్సులతోనే ఐదేళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్నానని అభిప్రాయపడ్డారు.
కార్యకర్తలను ఉద్దేశిస్తూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ పోటీ నుంచి ఎందుకు తప్పుకున్నారో ఇప్పుడు అర్థమవుతోందని మోదీ అన్నారు. గాలి ఎక్కడ వీస్తే పవార్ ఆ గూటికి చేరతారని విమర్శించారు. భాజపా పాలనకు ముందు ముంబయి.. ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉండేదన్నారు. ఒకప్పుడు కేవలం నన్ను మాత్రమే దూషించిన కాంగ్రెస్.. ఇప్పుడు సమాజం మొత్తాన్ని విమర్శిస్తుందన్నారు. వెనకబడిన వర్గానికి చెందిన కారణంగానే కాంగ్రెస్ తనని లక్ష్యంగా చేసుకుందన్నారు. దేశంలో ఓ వర్గం మొత్తాన్ని దొంగలుగా అభివర్ణిస్తున్నారన్నారు. పరోక్షంగా ‘దొంగలంతా మోదీ పేరుతో ఉన్నార’ని రాహుల్ చేసిన వ్యాఖ్యల్ని ఆయన తప్పుబట్టారు.
దేశం అభివృద్ధి దిశలో సాగాలంటే తిరిగి భాజపాయే అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల ఎన్సీపీ నుంచి భాజపాలో చేరిన రంజిత్ సిన్హా, ఆయన తండ్రి ఎన్సీపీ నేత విజయ్సిన్హా పాటిల్.. మోదీతో కలిసి వేదికను పంచుకోవడం గమనార్హం. అయితే మోడీ వైఖరి పై ప్రతిపక్షాలు స్పందించాయి. ఇప్పటి వరకు తాను ప్రభుత్వంలో ఏమి చేసింది చెప్పకుండా, నెహ్రు, పాకిస్తాన్ అంటూ కాలం గడిపేసి, ఇప్పుడు మళ్ళీ నేను తక్కువ కులం వాడిని అంటూ, కొత్త డ్రామా మొదలు పెట్టారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా, మోడీ చెప్పే డైలాగ్ ఇదే అని, రేపో మాపో, నన్ను చంపటానికి చూస్తున్నారు అంటూ కూడా మోడీ అంటారని, ఇలాంటి డైలాగులు ప్రతి ఎన్నికల ప్రచారంలో వినేవే అంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి.