ఎన్నికల ఫలితాలకు ఇంకా నెలరోజులపైనే సమయం ఉందని, అలాగని అప్పటివరకు పాలన పక్కన పెట్టి ఖాళీగా కూర్చోనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడం-రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నడిపించడం తనకు ముఖ్యమని చెప్పారు. బుధవారం ఉండవల్లిలోని ప్రజావేదికలో పోలవరం ప్రాజెక్టు పనులపై ముఖ్యమంత్రి 90వ వర్చువల్ రివ్యూ నిర్వహించారు. జులై కల్లా పోలవరం ప్రాజెక్టు నుంచి నీరిచ్చేలా 60 రోజుల ప్రణాళికతో పనులు వేగవంతం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు. మార్చి, ఏప్రిల్‌లో 45 రోజుల పాటు పనులు మందకొడిగా సాగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సమయం కావడంతో జరిగిన ఆలస్యాన్ని అధిగమించేలా చర్యలు తీసుకోవాలని జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు సూచించారు. 42.5 మీటర్ల ఎత్తులో కాఫర్ డ్యామ్ నిర్మించాల్సి ఉందని, అయితే జూన్ కల్లా 35 మీటర్ల ఎత్తున నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పారు. స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్ ముందుగా నిర్మించి స్పిల్ చానల్ పనులు అనుకున్న సమయానికి పూర్తయ్యేలా చూడాలన్నారు. పోలవరం నిర్వాసితులకు చేపట్టిన పునరావసం పనులు కూడా సమాంతరంగా పూర్తికావాలన్నారు.
జూన్ 20 నుంచి గోదావరి ప్రవాహం సగటున 5 లక్షల క్యూసెక్కులు ఉండొచ్చని అధికారులు వివరించగా, అంతకుమించి వరద పోటెత్తినా పనులకు ఆటంకం కలుగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు మొత్తం 69% పూర్తికాగా, తవ్వకం పనులు 84.60%, కాంక్రీట్ పనులు 72.40% పూర్తయినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. కుడి ప్రధాన కాలువ 90.87%, ఎడమ ప్రధాన కాలువ 70.38%, రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 66.22%, ఎగువ కాఫర్ డ్యామ్ పనులు 40.71%, దిగువ కాఫర్ డ్యామ్ పనులు 25.04% పూర్తయినట్టు అధికారులు పేర్కొన్నారు. మొత్తం 38.88 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులకు గాను 28.16 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు, 1169.56 లక్షల క్యూబిక్ మీటర్ల తవ్వకం పనులకు గాను 989.16 క్యూబిక్ మీటర్ల వరకు పనులు పూర్తయినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గతవారం స్పిల్ వే, స్పిల్ చానల్, పైలట్ చానల్, అప్రోచ్ చానల్, లెఫ్ట్ ఫ్లాంక్‌కు సంబంధించి 3.43 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు పూర్తికాగా, స్పిల్ వే, స్పిల్ చానల్, స్టిల్లింగ్ బేసిన్‌కు సంబంధించి 31 వేల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి రాష్ట్రానికి కేంద్రం ఇప్పటికి రూ.4,508.35 కోట్లు బకాయి పడిందని అధికారులు చెప్పారు.
గేటెడ్ కమ్యూనిటీల్లా నిర్వాసితుల కాలనీలు... తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని ఇందుకూరులో 660 ఎస్టీ నిర్వాసిత కుటుంబాలకు నిర్మిస్తున్న కాలనీని గేటెడ్ కమ్యూనిటీ తరహాలో తీర్చిదిద్దుతున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఒక్కో నిర్వాసిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా లక్ష రూపాయలు ఇవ్వడంతో కమ్యూనిటీ హాలు, పార్కు, ఆటస్థలం, అంగన్ వాడీ భవనం, న్యూట్రీ గార్డెన్, షాపింగ్ కాంప్లెక్స్, వెటర్నరీ హాస్పటల్ తదితర 24 మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. ఇళ్లు విశాలంగా నిర్మిస్తున్నామని, 15 రోజులకోసారి పనులను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ప్రతి ఇంటి చుట్టూ గార్డెన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. గిరిజనులు కోళ్లు, గేదెలు, ఆవులు వంటివి పెంచుకునేందుకు సామూహిక వసతులు కల్పించడంతో పాటు, విద్యుత్ సదుపాయంతో దోబీ ఘాట్లు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ముఖ్యమంత్రి కార్యదర్శి ఏవీ రాజమౌళి, పోలవరం ఆర్&ఆర్ కమిషనర్ రేఖారాణి, ఈఎన్సీ వెంకటేశ్వరరావు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.