‘‘సీఎం చంద్రబాబు పట్ల నాకు చాలా గౌరవం ఉంది. సీఎంకు పవర్స్ లేవని నేనెప్పుడూ కామెంట్ చేయలేదు. పిచ్చాపాటిగా నోరుజారి కూడా ఎవరితోనూ ఆ మాట అనలేదు’’ అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం అమరావతి సచివాలయంలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘‘ఈసీ నిర్దేశించిన ప్రవర్తనా నియమావళి ప్రకారమే అధికారులు, ప్రజాప్రతినిధులు నడుచుకోవాల్సి ఉంటుంది. మేం ఈ విషయమే ఎవరికైనా చెప్తుంటాం. అంతే, కానీ సీఎంకు అధికారాలు ఉన్నాయా? లేవా? అన్న అంశం ప్రస్తావనకు రాలేదు’’ అని ద్వివేది వివరించారు. అయితే, ఈ అంశాన్ని మేం విస్తృతంగా ప్రచారం చేసినట్లు ఈసీకి చంద్రబాబు రాసిన లేఖలో పేర్కొనడం ఆశ్యర్యంగా ఉందన్నారు.
దేశవ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ పూర్తయిన తరువాతే రీ పోలింగ్ నిర్వహిస్తామని ద్వివేదీ తెలిపారు. ప్రస్తుతం రెండు దశల్లో పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. మూడోదశ పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ఆరంభం కానుంది. తొమ్మిది రాష్ట్రాల్లో 71 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించబోతున్నారు. అనంతరం వచ్చేనెల 6, 12, 19వ తేదీల్లో మిగిలిన మూడు దశల్లో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. 23వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. వచ్చే నెల 20వ తేదీ నుంచి 23వ తేదీ లోపు ఎప్పుడైనా రీపోలింగ్ నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్రంలో అయిదు చోట్ల రీ పోలింగ్ చేపట్టనున్నట్లు ద్వివేదీ వెల్లడించారు. ఈసీ నిబంధనలను అనుసరిస్తాం కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ప్రవర్తనా నియమావళి ప్రకారమే అధికారులు, ప్రజాప్రతినిధులు నడుచుకోవాల్సి ఉంటుందని ద్వివేదీ చెప్పారు.
ఎవరు తమను ప్రశ్నించినా, ఇదే సమాధానం ఇస్తామని అన్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా సమీక్షలు నిర్వహించుకునే అధికారం చంద్రబాబుకు ఉందా? లేదా? అనేది తమ పరిధిలో లేదని అన్నారు. అసలు ఈ విషయమే ప్రస్తావనకు రాలేదని అన్నారు. ఈ అంశాన్ని మేం విస్తృతంగా ప్రచారం చేసినట్లు కేద్ర చంద్రబాబు రాసిన లేఖలో పేర్కొనడం ఆశ్యర్యంగా ఉందన్నారు. రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల ఐదు కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని ఈసీకి నివేదిక పంపామని, కౌంటింగ్లోపు ఎప్పుడైనా రీపోలింగ్ నిర్వహించే అవకాశం ఉందని ద్వివేదీ చెప్పారు.