మంచు మనిషి (యతి) హిమాలయాల్లో ఉంటున్నారని కొన్నేళ్లుగా ప్రపంచ దేశాల్లో చర్చ జరుగుతోంది. తాము యతిని చూశామని ఇదివరకు కొందరు అస్పష్టమైన ఫొటోలు కూడా విడుదల చేశారు. అవన్నీ గ్రాఫిక్సేనని కొట్టిపారేశారు చాలామంది. అంతెందుకు హాలీవుడ్ మూవీ మమ్మీ సిరీస్‌లో వచ్చిన మూడో సినిమా మమ్మీ టోంబ్ ఆఫ్ ది డ్రాగన్ ఎంపెరర్‌లో చాలా యతిలను చూపించారు. ఈ మిస్టీరియస్ జీవి ఉందా లేదా అన్న చర్చ అలా కొనసాగుతుండగా... అది ఉంది అని నిరూపించే పాద ముద్రలను ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది. ఇప్పుడు నిజంగానే హిమాలయాల్లో మంచు మనిషి జాడలు కనిపించాయట. మన ఇండియన్ ఆర్మీనే నిర్దారించింది. నేపాల్ సమీపంలో హిమాలయ పర్వత శ్రేణుల్లో యతి అడుగుజాడలు ఉన్నట్లు ఆర్మీ తెలిపింది.
ఏప్రిల్ 9న సైనికుల బృందం హిమాలయాల్లో సాహసయాత్రకు వెళ్లింది. నేపాల్ సమీపంలో మకలు బేస్ క్యాంప్ సమీపంలో మంచు మనిషి అడుగులను బృందం గుర్తించింది. ఈ పాదముద్రలు 32 అంగుళాల పొడవు 15 అంగుళాల వెడల్పుతో ఉన్నాయని.. వీటిని పరిశీలించిన ఆర్మీ అధికారులు కచ్చితంగా ఈ అడుగులు ‘యతి’వే అంటున్నారు. ఫోటోలను కూడా ఆర్మీ ట్వీట్ చేసింది. అంతేకాదు గతంలో మకలు-బరున్ నేషనల్ పార్క్ సమీపంలో మంచి మనిషి (యతి) అడుగులు కన్పించినట్లు సైన్యం చెబుతోంది. మంచుకొండల్లో మంచు మనిషి (యతి) అడుగుల ఫోటోలను ఆర్మీ అధికారులు చేసిన ట్వీట్‌కు నెటిజన్లు, పర్వతారోహకులు ఆసక్తికరంగా స్పందించారు.
నిజంగానే మంచు మనిషి ఉన్నాడా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి పురాణాల్లో వినడమో లేక పాత సినిమాల్లో చూసి ఉండటమో జరిగి ఉంటుంది. కానీ నిజంగానే మంచు మనిషి ఉన్నాడా అంటే నమ్మశక్యంగా లేదంటున్నారు. హిమాలయాలతోపాటూ సైబీరియా, తూర్పు, మధ్య ఆసియాలో కూడా యతి లాంటి జీవులు ఉన్నాయని చెబుతున్నారు. యతి ఓ దైవ సమానమైన జీవి అనీ, దాదాపు తోడేలులా ఉంటుందనీ, రాయితో తయారు చేసిన భారీ ఆయుధాన్ని చేతబట్టి... విజిల్ సౌండ్ చేస్తూ వెళ్తుందని హిమాలయాల ప్రజలు నమ్ముతున్నారు. మొత్తానికి ఫొటోలు రిలీజ్ చేసింది ఇండియన్ ఆర్మీ కావడంతో యతి ఉందన్న అంశంపై మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.