రాష్ట్రంలో, దేశంలో ఎన్నో సమస్యలు.. నిన్న కాక మొన్న తెలంగాణాలో, 23 మంది విద్యార్ధుల ప్రాణాలు ఎగిరిపోయాయి, అదీ ప్రభుత్వ అసమర్ధత వల్ల.. ఇన్ని సమస్యల పై నోరు ఎత్తటానికి జగన్ మోహన్ రెడ్డి గారికి టైం లేదు. తాను ఉండే హైదరాబాద్ లో ఎంతో మంది తల్లులు, తండ్రులు, పిల్లల ఏడుపులు వింటూ ఆస్వాదిస్తూ, నోరు ఎత్తలేదు. సొంత బాబాయ్ ని ఎవరు చంపారో తెలుసుకునే ఇంట్రెస్ట్ లేదు. పోలీసులను, ఏపి ప్రభుత్వాన్ని ఈ దిశగా ప్రశ్నించే డమ్ము లేదు. కాని A సర్టిఫికేట్ సినిమాలు తీసుకునే రాం గోపాల్ వర్మను విజయవాడ పోలీసులు, తిప్పి హైదరాబాద్ పంపిస్తే మాత్రం, జగన్ గారు తట్టుకోలేక పోతున్నారు. రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పేంటని ట్విట్టర్‌లో జగన్ ప్రశ్నించారు.
‘‘విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టలేని పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. పోలీసుల్ని బంట్రోతులు కన్నా హీనంగా వాడుకునే పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. ఇదా ప్రజాస్వామ్యం..! చంద్రబాబు గారూ..! ఇంతకీ రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పేంటి..?’’ అంటూ జగన్ ట్వీట్ చేశారు. ఇదే వర్మ వారం క్రితం, కేసీఆర్ బయోపిక్ అంటూ హడావిడి చేసి, ఆంధ్రుడా నిన్ను తొక్కుతా, కొడతా అంటూ ఎదో మత్తులో ఒక పాట పాడితే, ఆంధ్రప్రదేశ్ ప్రజలను, రాష్ట్రాన్ని దుర్మార్గంగా తిడుతుంటే, ఒక్క మాట కూడా మాట్లాడని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్, విజయవాడ పోలీసులు వర్మని అరెస్ట్ చేస్తే మాత్రం, పాపం తట్టుకోలేక పోతున్నారు.
వర్మ తీసిన తాజా చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు’ విడుదల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో బ్రేక్ పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మే ఒకటిన సినిమా విడుదల చేయాలని నిర్ణయించారు. ఆ వివరాలు చెప్పడానికి ఆదివారం విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు వర్మ ట్విటర్‌లో పేర్కొన్నారు. నోవాటెల్ హోటల్‌లో ప్రెస్‌మీట్ ఉంటుందని ప్రకటించారు. తర్వాత దాన్ని హోటల్ ఐలాపురానికి మార్చారు. కొద్దిసేపటికే అజిత్‌సింగ్‌నగర్‌లోని పైపులరోడ్డు జంక్షన్‌లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగంగా విలేకరుల సమావేశం నిర్వహిస్తానని వర్మ తెలిపారు. చిత్ర నిర్మాత రాకేశ్‌రెడ్డితో కలిసి రాంగోపాల్ వర్మ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. విమానాశ్రయం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. అయినా కారులో పైపులరోడ్డుకు బయలుదేరారు. ఈ సమాచారాన్ని విమానాశ్రయ పోలీసులు సిటీ పోలీసులకు చేరవేశారు. దీంతో రామవరప్పాడు రింగ్‌రోడ్డు వద్ద పోలీసులు వర్మ కారును అడ్డుకున్నారు. కారులో నుంచి ఇద్దరినీ దింపేసి మరో కారులో తిరిగి విమానాశ్రయానికి పంపేశారు.