ఎన్నికల ఫలితాలు ఇంకా వెలువడకముందే, పార్టీ అధికారంలోకి రాకముందే అధికారులపై వైసీపీ నాయకులు పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘మేం చెప్పినట్లు పనులు చేయాలి. లేదంటే వాటిని ఆపేయాలి’ అంటూ మంగళవారం ఏకంగా అనంతపురం, కనగానపల్లిఎంపీడీఓ కార్యాలయానికి తాళాలు వేశారు. వివరాల్లోకి వెళితే.. కనగానపల్లి ఫీల్డ్ అసిస్టెంటుగా దాసరి నాగేశ్ విధులు నిర్వర్తించేవాడు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలోకి చేరడంతో పాటు ఆ పార్టీ కోసం విస్తృతంగా ప్రచారం చేశాడు. ఫీల్డ్ అసిస్టెంటుగా ఉద్యోగం చేస్తూ.. ఒక పార్టీకి ప్రచారం చేయడాన్ని జిల్లా యంత్రాంగం సీరియ్‌సగా తీసుకుని ఉద్యోగం నుంచి తొలగించింది. ఎన్నికల అనంతరం ఉపాధి కూలీలకు పనులు కల్పించే కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు నిమగ్నమయ్యారు.
అందులో భాగంగా కనగానపల్లిలో కూడా అక్కడి కూలీలకు పనులు కల్పించారు. ఇందుకోసం రాంపురం ఫీల్డ్ అసిస్టెంటుగా పనిచేస్తున్న నాగభూషణాన్ని కనగానపల్లిఇన్చార్జి ఫీల్డ్ అసిస్టెంటుగా అధికారులు నియమించారు. అంతటితో సమస్య సద్దుమణిగిందనుకున్న అధికారులకు వైసీపీ నాయకులు అడ్డు తగిలారు. తమ పార్టీకి ప్రచారం చేసినంత మాత్రాన ఫీల్డ్ అసిస్టెంటు దాసరి నాగేశ్‌ను తొలగిస్తారా? ఎలా తొలగిస్తారంటూ వైసీపీ నాయకులు అధికారులను ప్రశ్నించారు. ఫీల్డ్ అసిస్టెంటుగా తిరిగి అతడినే నియమించి విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు అధికారులను హెచ్చరించారు. పనులు చేపడితే దాసరి నాగేశ్ ద్వారానే చేపట్టండి. లేదంటే కార్యాలయానికి తాళాలు వేస్తాం. ఏం చేసుకుంటారో చేసుకోండంటూ.. అన్నంత పనీ చేసేశారు. అధికారులందరినీ బయటికి పంపి తాళాలు వేశారు.
దీంతో చేసేదేమీ లేక అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఇన్చార్జి ఎంపీడీఓ నాగేంద్రకుమార్, ఏపీఓ జయమ్మ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఎస్ఐ వేణుగోపాల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ కలుగజేసుకుని ఎన్నికల కోడ్ సమయంలో కార్యాలయానికి తాళాలు ఎలా వేస్తారంటూ వైసీపీ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చట్టానికి లోబడి నడుచుకోవాలని, చట్టాన్ని అతిక్రమిస్తే ఏపార్టీ అయినా చట్టపరిధిలోనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంపీడీఓ కార్యాలయానికి తాళాలు తీయకపోతే చట్టపరిధిలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో చివరికి వైసీపీ నాయకులు తాళాలు తీసి వేశారు. దీంతో సమస్య సద్దుమణిగింది. అధికారం రాకముందే అధికారులపైనే వైసీపీ నాయకులు దురుసుగా ప్రవర్తిస్తున్నారంటే ఇక అధికారం వస్తే పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన అధికారుల్లో మొదలైంది. వైసీపీ నిర్వాకంపై అటు కూలీలు, ఇటు స్థానికులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.