ఏపీలో జరిగిన ఎన్నికల విషయంలో ఈసీ చేసిన తప్పులమీద తప్పులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. సమస్యాత్మక జిల్లాలు, ప్రాంతాల్లో భద్రతకు చాలినన్ని బలగాలను ఇవ్వకుండా దెబ్బకొట్టిన ఈసీ అనుబంధ పోలింగ్ కేంద్రాల ఏర్పాటులోనూ అన్యాయంగా వ్యవహరించింది. దాదాపు 25 లక్షల మంది ఓటర్లు కొత్తగా నమోదైనప్పటికీ పోలింగ్ కేంద్రాలను పెంచకుండా ఎన్నికల ప్రక్రియను తేలికగా తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు ఈసీ అనుబంధ కేంద్రాలకు అనుమతి ఇచ్చి ఉంటే రాష్ట్రంలో పోలింగ్ తీరు మరోలా ఉండేదని సీఈవో కార్యాలయం అభిప్రాయపడింది. రాష్ట్రంలో అనుబంధ పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ఎన్నికల సంఘం మోకాలడ్డింది. మార్చి 25న ఓటర్ల తుది జాబితా సిద్ధమైంది.
జనవరి 11నాటి జాబితాలో కంటే 25 లక్షల మంది ఓటర్లు అదనంగా చేరారు. దీంతో కొన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. మంగళగిరి నియోజకవర్గంలోని ఒక కేంద్రంలో ఓటర్ల సంఖ్య 2000కు చేరుకుంది. సాధారణంగా ఒక్కో పోలింగ్ కేంద్రంలో గరిష్ఠంగా 1400 మంది ఓటేసేలా చర్యలు తీసుకున్నారు. తుది జాబితా తర్వాత వందల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య 1400 దాటేసింది. కాబట్టి 478 అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ మేరకు సీఈవో ఎన్నికల సంఘానికి ప్రతిపాదన పంపారు. కానీ ఈసీ 38 అనుబంధ కేంద్రాలకే అనుమతిచ్చింది. ఈవీఎంల కొరత తీవ్రంగా ఉన్నందున మిగిలిన 440 అనుబంధ పోలింగ్ కేంద్రాలకు అనుమతివ్వలేమని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలో అరకొర ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహించారు.
గరిష్ఠంగా 1400 ఓటర్లు మాత్రమే ఓటేయాల్సిన 440 కేంద్రాల్లో అంతకుమించి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్ని కేంద్రాల వద్ద అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగడానికి ఇదీ కారణమే. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఐదుగురు సిబ్బందితో పాటు, ఒక అదనపు ఉద్యోగినీ అందుబాటులో ఉంచారు. పని ఒత్తిడి పెరిగినప్పుడు ఈ అదనపు ఉద్యోగి పని పంచుకుంటాడు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 45,959 కేంద్రాల్లో ఒక అదనపు ఉద్యోగి అందుబాటులో ఉన్నాడు. అదనంగా ఉన్న ఉద్యోగులను అవసరమైన చోటకు తరలించే ప్రయత్నం చేయలేదు. దీంతో వారు ఖాళీగా కూర్చున్నారు. అర్ధరాత్రి వరకు, ఆ తర్వాత పోలింగ్ జరిగిన కేంద్రాల్లో వీరి సేవలు వినియోగించుకుని ఉంటే ఇటు ఓటర్లు అటు పోలింగ్ సిబ్బంది ఎదుర్కొన్న ఇబ్బందులు తగ్గేవని సీనియర్ అధికారులు పేర్కొన్నారు.