టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్‌, వైసీపీ అభ్యర్థి కొడాలి నాని ఒకరిని మించి మరొకరు తీవ్రంగా పోటీపడిన గుడివాడ నియోజకవర్గ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈవీఎంలు తెరవడానికి ఇంకా 30 రోజుల పైగా సమయం ఉండటంతో ప్రధాన పక్షాల నాయకులు అంకెల లెక్కల్లో మునిగిపోయారు. గెలుపోటములను పోలింగ్‌ సరళి ఏవిధంగా ప్రభావితం చేస్తుందో అనే అంశంపై ప్రధాన పక్షాలైన టీడీపీ, వైసీపీ నాయకులు ఆరా తీస్తున్నారు. గుడివాడ పట్టణం, రూరల్‌, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లోని వివిధ గ్రామాల పోలింగ్‌ శాతాలను సేకరిస్తున్నారు. నియోజకవర్గంలోని 63 గ్రామాల్లో భారీగా పోలింగ్‌ జరగడం విశేషం. గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్‌ 85 శాతం జరిగింది. కొన్ని గ్రామాల్లో 90 శాతానికి మించడం గమనార్హం.

gudivada 21042019

ప్రధానంగా మహిళా ఓటర్లు వెల్లువెత్తడంతో వారి తీర్పు ఎలా ఉందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పసుపు-కుంకుమ ఎఫెక్ట్‌ పనిచేసిందని టీడీపీ వర్గీయులు అంటున్నారు. పోలింగ్‌కు సరిగ్గా రెండు రోజుల ముందే బ్యాంకుల్లో చెక్కులు మారడం వారిని ప్రభావితం చేసి ఉండవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, రాజధాని, పోలవరం నిర్మాణం మధ్యలో ఆగకుండా ఉండాలంటే మళ్లీ చంద్ర బాబు రావాలనే అభిప్రాయంతో ప్రజలు టీడీపీకి ఓటు వేశారని ఆ పార్టీ కార్యకర్తలు పేర్కొంటున్నారు. ఓటు వేయడానికి రాత్రి ఎంతసేపైనా వేచి ఉంటామని పట్టుదల ప్రదర్శించడం సానుకూల సంకేతమని విశ్లేషిస్తున్నారు. అయితే వైసీపీ అధినేత జగన్‌ ప్రకటించిన నవరత్నాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయని, అందుకే ఓటింగ్‌ శాతం పెరిగిందని ఆ పార్టీ వర్గీయులు వాదిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత సైలెంట్‌ ఓటింగ్‌కు దారితీసిందని వారి అంచనా.

gudivada 21042019

సామాజికవర్గాల వారీగా ఓటింగ్‌ వివరాలు కాస్త ఆలస్యంగా వెల్లడయ్యే అవకాశం ఉండటంతో రెండు పార్టీ నేతలు వాటి కోసం వేచిచూస్తున్నారు. పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే అన్ని సామాజికవర్గాల ఓటర్లు ఒకేరీతిగా స్పందించారని తెలుస్తోంది. ప్రలోభాల పర్వంలో వైసీపీ, టీడీపీ రెండూ పోటీపడటంతో క్రాస్‌ ఓటింగ్‌ భయం ఆ పార్టీల అభ్యర్థులను వెంటాడుతోంది. జనసేన బరిలో లేకపోవడంతో ఆ పార్టీ అభిమానులు ఎంపీ ఓటు తమ అభ్యర్థి బండ్రెడ్డి రామ్మోహన్‌కు వేశారని తెలుస్తోంది. ఎమ్మెల్యే ఓటు టీడీపీ, వైసీపీ, నోటా ఇలా ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వారు వేశారని సమాచారం. జనసేనకు సంబంధించిన ఓట్లు టీడీపీ, వైసీపీకి సమానంగా పోల్‌ అయ్యాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైసీపీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉండే ఎస్సీ వాడల్లో సైతం టీడీపీకి ఆదరణ లభించడంతో గెలుపు తమదేనని ఆ పార్టీ శ్రేణులు ఆనందంలో తేలియాడుతున్నాయి. టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్‌ తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినా ప్రజలను తన కలుపుగోలుతనంతో ఆకట్టుకున్నారనేది ఆ పార్టీ వర్గీయుల వాదన. దీనితో పాటు పదిహేనేళ్లుగా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉండటంతో పాటు వైసీపీ అభ్యర్థిపై ఉన్న తీవ్ర ప్రజావ్యతిరేకత అవినాష్‌ గెలుపునకు బాటలు వేస్తాయని టీడీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. నందివాడ, గుడివాడ టౌన్‌, గుడ్లవల్లేరు, గుడివాడ రూరల్‌ అన్నింటిలోనూ ఆధిక్యత తమదేనని ఇరుపక్షాలు ధీమా వ్యక్తం చేస్తుండటం విశేషం.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read