ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఓ నేమ్ ప్లేట్ దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేమ్‌ప్లేట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు స్పందించారు. శనివారం రోజున తిరుపతిలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న ఆయన అనంతరం కార్యక్రమంలో మాట్లాడుతూ.. వైసీపీ గెలుస్తుందని సీఎం అంటూ నేమ్‌బోర్డ్‌లు రాసుకోవడం చూశామని అయితే అసలు నిజాలు తెలియడంతో నేతలు పారిపోయారన్నారు. అధికారులపై ఉన్న కేసుల జగన్ వల్ల కలిగిన ఇబ్బందులను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తనకు అధికారులపై ఎలాంటి ద్వేషం లేదన్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ ఇదే తిరుపతిలో మోడీ రాష్ట్రానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని.. నేటికి ధర్మ పోరాట దీక్ష మొదలుపెట్టి ఏడాది పూర్తయిందన్నారు. హామీలను నెరవేర్చకపోతే రాజీలేని పోరాటం చేశామని.. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల కోడ్ అడ్డుపెట్టుకొని కుట్రలు చేస్తున్నారన్నారు. ఇప్పడు నా పోరాటం ఎన్నికల సంఘం మీద కాదని.. ఎన్నికల సంఘం అవలంభిస్తున్న తీరు మీద తన పోరాటమన్నారు. ఎవరి ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం పనిచేస్తుందో రాష్ట్రంలో అందరికీ తెలుసని.. వైసీపీ నేతలు ఫిర్యాదులు ఈసీకి ఆదేశాలుగా మారుతున్నాయన్నారు.
దేశంలో ఎక్కడా ఎవరికి లేని ఆంక్షలు ఏపీలో ఉంటున్నాయన్న బాబు ప్రధాని మోడీ ఐబీతో సహా అన్ని సమీక్షలు చేస్తున్నారన్నారు. అందరికీ ఆంక్షలు పెడితే నేను కూడా అనుసరిస్తానని.. ఒక్క ఏపీలోనే ఈ విధానాలు ఎందుకని ప్రశ్నించారు. అధికారులను ప్రధాని మోడీ కోసం పనిచేయవద్దని కోరుతున్నానని.. ప్రజాస్వామ్యం కోసం, ప్రజల కోసం పనిచేయాలని అయన కోరారు. బీజేపీ, మోడీకి వ్యతిరేకంగా దేశంలో ఏ పార్టీ, ఏ అభ్యర్థి పనిచేస్తుంటే అక్కడ ఈసీ, ఐటీ, ఈడీ ప్రత్యక్షమవుతారని.. ఇదే ప్రజాస్వామ్యమంటే అని ప్రశ్నించారు.