తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నిర్వాకంతో ఏ తప్పూ చేయని కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బాగా చదివే వారు కూడా ఫెయిల్ కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో అనేక మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. విచిత్రమేంటంటే మొదటి సంవత్సరంలో జిల్లా టాపర్గా నిలిచిన విద్యార్థులు కూడా సున్నా మార్కులు రావడంతో విద్యాశాఖ పనితీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంచిర్యాల జిల్లా చింతగూడెం గ్రామానికి చెందిన నవ్య అనే విద్యార్థిని గతేడాది ఇంటర్ మొదటి సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించి, జిల్లాలోనే టాపర్గా నిలిచింది.
తెలుగులో ఏకంగా 98 మార్కులు సాధించింది. ఈ ఏడాది ఇంటర్మీడియట్ రెండో సంవత్సరంలో మిగతా సబ్జెక్టులన్నీ పాస్ అయ్యింది. కానీ తెలుగు సబ్జెక్టులో ఆమెకు 'సున్నా' మార్కులు వచ్చాయి. దీంతో విద్యార్థితో పాటు ఆమె తల్లిదండ్రులు షాక్కు గురయ్యారు. దీనికి కారణమెంటో తెలుసుకునేందుకు ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళన చేపట్టారు. అయినా.. అధికారులు వారిని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు తెలుగులో సున్నా మార్కులు రావడం పట్ల ఆ విద్యార్థిని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు ఇంటర్ ఫస్టియర్ తెలుగులో 98 మార్కులు వచ్చాయని. మొత్తం 476 మార్కులతో ఫస్టియర్ జిల్లా టాపర్గా నిలిచినట్లు ఆమె తెలిపింది. కాని సెకండియర్లో ఫెయిల్ చేశారు. అసలు తనకు తెలుగులో 99 మార్కులు రావాలని ఆ విద్యార్థిని చెబుతోంది. త
నలాంటి ఎంతో మంది విద్యార్థులకు కూడా ఇలాగే చేశారని ఆమె అంటుంది. తెలుగు సబ్జెక్టు మార్కులు కాక తనకు 825 మార్కులు వచ్చాయని.. తెలుగు మార్కులు యాడ్ అయితే 900 మార్కులకు పైగా వచ్చేవని ఆ విద్యార్థిని అంటోంది. ఇది ఆ అమ్మాయి ఒక్కరి పరిస్థితే కాదు.. దాదాపు 25 వేల మంది విద్యార్థులుకు ఇటువంటి పరిస్థితే ఎదురైంది. అధికారులు ఇష్టారాజ్యంగా పేపర్లు దిద్దడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి హైదరాబాద్లోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, పరీక్షల్లో ఫెయిలయ్యామన్న మనస్తాపంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ పై ఒంటి కాలు మీద లేగిసే హైదరాబాద్ మీడియా, అక్కడ మేధావులు అని చెప్పుకు తిరిగే వారు మాత్రం, పాపం కేసీఆర్ ను ప్రశ్నించాలి అంటే భయపడుతున్నారు.