జనసేన పార్టీలో చేరిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ, విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలు ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, జనసేన పార్టీకి 88 సీట్లు వస్తాయని, మేమే అధికారంలోకి వస్తామని, నెంబర్ తో సహా చెప్పారు. ఈ నెంబర్ పై విజయసాయి రెడ్డితో ట్వీట్ వార్ కూడా నడిచింది. ఈయన నెంబర్ తో సహా మేము అధికారంలోకి వస్తాం అని చెప్తుంటే, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే తమకు 120 సీట్లు వస్తాయని వైసీపీ.. తాము ఇన్ని సీట్లలో గెలుస్తామంటూ టీడీపీ లెక్కలేయడం మొదలు పెట్టాయని.. కానీ మార్పు కోసం అవతరించిన జనసేన మాత్రం ఇలా అసెంబ్లీ, లోక్సభ స్థానాల లెక్కలు వేయదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
ఒక పక్క లక్ష్మీనారాయణ 88 సీట్లు వస్తాయంటే, పవన్ మాత్రం, మాకు అలా లెక్కలు వేసే అలవాటు లేదని చెప్తున్నారు. ‘ప్రజలు రాజకీయాల్లో మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు జనసేనతోనే మొదలైంది. తెలంగాణలో కూడా ఇదే తరహా మార్పును ప్రజలు ఆహ్వానిస్తున్నారు. ఈ ఉత్సాహాన్ని ఇలాగే కొనసాగిద్దాం. ప్రజల అంచనాలను అందుకునే విధంగా జనసేన శ్రేణులు మనస్ఫూర్తిగా నిస్వార్థ సేవ చేయాలి. అదే ప్రజలకు మనమిచ్చే నిజమైన కృతజ్ఞత’ అని పేర్కొన్నారు. రాజకీయానుభవంలేకుండా ఈ ఎన్నికల్లో జనసేన తరఫున అభ్యర్థులుగా బరిలోకి దిగిన 14 మందితో ఆయన ఆదివారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు.
ఎన్నికల ఫలితాలపై విశ్లేషించేందుకో.. ఓట్లు, సీట్ల సంఖ్యపై సమీక్షించేందుకో పిలవలేదని.. ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసినవారిగా ఎదురైన అనుభవాలను వివరించాలని వారిని కోరారు. ‘మనమింకా ఎదిగే దశలోనే ఉన్నాం. మార్పు అనేది చిన్నగానే మొదలవుతుంది. ఈ మార్పు ఎక్కడి దాకా వెళ్తుందో చెప్పలేం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలి. నేను మిమ్మల్ని గుర్తించిన విధంగానే.. మీరు కూడా గ్రామస్థాయి నుంచి నాయకులను గుర్తించి నిబద్ధత కలిగిన నేతల్ని తయారుచేయాలి. ప్రతి గ్రామానికీ ఒక రోజు కేటాయించి ప్రజలందరినీ కలవాలి. వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి. నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలను కొనసాగించాలి. కార్యాలయమంటే మరీ పెద్ద భవంతులు అవసరం లేదు. ఒక గది, కార్యకర్తలు కూర్చొనేందుకు కుర్చీలు, మీడియా సమావేశం ఏర్పాటుకు ప్రత్యేక గది ఉంటే చాలు’ అని సూచించారు.