దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహారాష్ట్రలోని మాలేగావ్ బాంబు పేలుడు కేసు ఘటనలో ప్రధానంగా వినిపించిన పేరు సాధ్వి ప్రజ్ఞాసింగ్. ఈ కేసులో చాలాకాలం పాటు కారాగార శిక్షను అనుభవించిన ఆమె.. విడుదల అయ్యారు. రాజకీయ రంగప్రవేశం చేశారు. భారతీయ జనతాపార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. లోక్ సభ ఎన్నికల బరిలో నిల్చోవడానికి సిద్ధపడ్డారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి ఆమె లోక్ సభకు పోటీ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ భోపాల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రేసులో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే భాజపాలో చేరి భోపాల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన శాపం వల్లే ఐపీఎస్ ఆఫీసర్ హేమంత్ కర్కరే మరణించారని వ్యాఖ్యానించారు.
ముంబయి యాంటీ టెర్రరిస్ట్ విభాగాధిపతిగా పనిచేసిన హేమంత్ 26/11 దాడిలో ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే. అతని సేవలకు గుర్తింపుగా మరణానంతరం ఆయనకు అశోక్చక్ర అవార్డు లభించింది. ‘‘నన్ను ఆయన తీవ్రంగా వేధించారు. దీంతో నేను ఆయన్ని శపించాను. అప్పటి నుంచి ఆయనకు అశుభ ఘడియలు మొదలయ్యాయి. అనంతరం ఆయన ఉగ్రవాదుల చేతుల్లో హత్యకు గురయ్యారు’’ అని ప్రజ్ఞా ఠాకూర్ అన్నారు. ఎన్నికల వేళ విలేకరులతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా పేర్కొన్న వారిలో సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఒకరు. దీనిపై విచారణ చేపట్టిన హేమంత్ కర్కరే.. పేలుళ్లలో వాడిన ద్విచక్రవాహనం ప్రజ్ఞా పేరు మీదే నమోదై ఉందన్న ఆరోపణలతో ఆమెను అరెస్టు చేశారు.
2016లో ఆమెకు ఎన్ఐఏ క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ కేసును కొట్టి వేయడానికి కోర్టు మాత్రం అంగీకరించలేదు. దీంతో ప్రస్తుతం ఆమె బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇటీవలే భాజపాలో చేరిన ఆమె ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న భోపాల్ నుంచి పోటీ చేస్తున్నారు. మరోవైపు ఆమెకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ తరఫున కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. కాగా.. సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలంటూ మాలేగావ్ పేలుళ్లలో కుమారుడిని కోల్పోయిన నిస్సార్ సయీద్ గురువారం ప్రత్యేక ఎన్ఐఏ కోర్టును ఆశ్రయించారు. ఈ అభ్యర్థనను పరిశీలించిన న్యాయమూర్తి ఎన్ఐఏ, ప్రజ్ఞాసింగ్‌లిద్దరినీ సమాధానాలు సమర్పించాల్సిందిగా కోరుతూ విచారణను సోమవారానికి వాయిదా వేశారు. అయితే ఉగ్రవాదుల చేతుల్లో హత్యకు గురైన వీరుడు, ముంబయి యాంటీ టెర్రరిస్ట్ విభాగాధిపతిగా పనిచేసిన హేమంత్ పై ఈమె చసిన వ్యాఖ్యలను మోడీ ఎలా సమర్దిస్తారో మరి. అయినా, ఇలాంటి వారందరినీ, రాజకీయాల్లోకి తెచ్చి, ఈ దేశాన్ని ఏమి చెయ్యాలి అనుకుంటున్నారో, మోడీనే చెప్పాలి.